Mahaa Daily Exclusive

  ఏపీ లిక్కర్ స్కామ్….

Share

ఏపీ లిక్కర్ స్కామ్.
* దర్యాప్తు వేగం పెంచిన ఈడీ.
* ఆ ముగ్గురి కస్టడీ కోసం పిటిషన్.
* నేడే కోర్టు కీలక నిర్ణయం.
* ఖజానాకు రూ.196 కోట్ల గండి.
* ఆధారాల వేటలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. అక్రమార్కులపై ఉచ్చు బిగిస్తూ విచారణ వేగాన్ని అమాంతం పెంచింది. ఈ మద్యం రవాణా పాలసీ విధానంలో జరిగిన భారీ అక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.196.33 కోట్ల మేర గండిపడిందని ఈడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంతటి భారీ స్థాయిలో జరిగిన ప్రజాధనం లూటీకి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు సిద్ధమైన దర్యాప్తు సంస్థ.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించింది.
ఈ భారీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్ కెశిరెడ్డితో పాటు రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ కుమార్‌లను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిన మద్యం రవాణా విధానం, టెండర్ల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై లోతైన విచారణ జరిపి పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉందని దర్యాప్తు అధికారులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల నుంచి కీలక పత్రాలు, తెరవెనుక జరిగిన నగదు లావాదేవీల వివరాలను రాబట్టాల్సిన అవసరం ఉన్నందున వారి కస్టడీ అత్యంత ఆవశ్యకమని తమ పిటిషన్‌లో స్పష్టం చేశారు.
ఈడీ అధికారులు దాఖలు చేసిన ఈ కస్టడీ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. నిందితుల తరపు న్యాయవాదులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తిపై కౌంటర్లు దాఖలు చేయాలని డిఫెన్స్ లాయర్లను న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో ఇరుపక్షాల తరపున జరిగిన ప్రాథమిక వాదనలను సుదీర్ఘంగా విన్న కోర్టు.. తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై నేటి విచారణలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశంపై రాజకీయ, అధికార వర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల వివరాలు బయటపడాలంటే నిందితులను విచారించడం ఎంతో కీలకమని భావిస్తున్న ఈడీకి, కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.