Mahaa Daily Exclusive

  దేశంలోనే తొలిసారి ఉస్మానియా ఆస్పత్రి ఘనత…

Share

  • దేశంలోనే తొలిసారి ఉస్మానియా ఆస్పత్రి ఘనత
  • రోగికి ఒకేసారి 5 అవయవాల మార్పిడి
  • కీలక మైలురాయిని అధిగమించిన ప్రభుత్వాసుపత్రి

హైదరాబాద్, మహా : ఉస్మానియా ఆస్పత్రి మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక రోగికి ఒకేసారి 5 అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసి అరుదైన ఘనతను దక్కించుకుంది. 36 గంటల పాటు నాన్‌స్టాప్‌గా సాగిన ఈ సుదీర్ఘ ఆపరేషన్‌ సక్సెస్ కావడంతో.. ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

మన రాష్ట్రంలో ఉస్మానియా ఆస్పత్రి లో ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకుని.. అత్యంత కఠినమైన, సంక్లిష్ఠమైన ఆపరేషన్లను కూడా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు.. గతంలో సక్సెస్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో అరుదైన ఆపరేషన్ నిర్వహించి సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశంలోనే ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఒకేసారి ఒక రోగికి 5 అవయవాలను మార్పిడి చేసి.. ఉస్మానియా డాక్టర్లు సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ప్రభుత్వ వైద్యుల ప్రతిభకు.. రోగుల ఆరోగ్యం పట్ల వారికి ఉన్న అంకితభావానికి నిలువెత్తు నిదర్శనంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిలిచింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక 30 ఏళ్ల యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆ టెకీ అరుదైన, ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యతో బాధపడేవాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడి ప్రాణాలు రక్షించేందుకు ఉస్మానియా ఆస్పత్రి సర్జన్లు రంగంలోకి దిగారు. ఈ ఆపరేషన్ ఏకధాటిగా 36 గంటల పాటు జరగడం గమనార్హం. అత్యంత సంక్లిష్టమైన విప్లవాత్మక శస్త్రచికిత్సలో ఆ రోగికి ఒకేసారి 5 అవయవాలను విజయవంతంగా మార్పిడి చేశారు. జీర్ణాశయం, ద్వాదశ శుక్లం, క్లోమం, చిన్న పేగు, కుడి వైపు పెద్ద పేగు వంటి 5 అవయవాలను మార్పిడి చేసి వైద్య చరిత్రలోనే ఉస్మానియా డాక్టర్లు సరికొత్త అధ్యాయం లిఖించారు. సాధారణంగా ఒక వ్యక్తికి, ఒకసారి ఒక అవయవం మార్పిడి చేయడమే డాక్టర్లకు ఎంతో పెద్ద సవాలుతో కూడుకున్న పని. అలాంటిది ఒకే సర్జరీలో 5 అవయవాలను సక్సెస్‌ఫుల్‌గా మార్పిడి చేయడం మన దేశ వైద్య చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం. కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా.. ప్రభుత్వ రంగంలో ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఈ స్థాయి విజయం సాధించడం ఎంతో గర్వకారణంగా నిలిచింది.

ఉస్మానియా ఆస్పత్రి సాధించిన ఈ అసాధారణ విజయంతో తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరినట్లయింది. ఈ అత్యాధునిక వైద్య సేవలను పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తోందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక భారత వైద్య రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఉస్మానియా ట్రాన్స్‌ప్లాంట్ టీమ్‌కు, ఇందుకు సహకరించిన సిబ్బందికి సర్వత్రా అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.