రాష్ట్ర అజెండా మారాలి.
* రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర అజెండా తక్షణమే మారాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అయినా ఎలాంటి అభివృద్ధి చేయకుండానే మళ్లీ అధికారంలోకి వస్తానని సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెబుతూనే.. మరోవైపు మూసీ ప్రాజెక్టు కోసం ఏకంగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పడం ఏంటని ఆమె సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్నా సామాన్య, పేద ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో ఎలాంటి మార్పులు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే బలమైన సంకల్పం, ఉద్దేశంతోనే తాను ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా సంపూర్ణ ఉచిత విద్యతో పాటు, నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. పేదల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర అజెండాను పూర్తిగా మారుస్తానని ఉద్ఘాటించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని కవిత పిలుపునిచ్చారు. నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. షార్ట్‌కట్‌లను వెతకకుండా కేవలం హార్డ్ వర్క్‌ను (కష్టపడి పనిచేయడాన్ని) మాత్రమే నమ్ముకుని ముందుకు సాగితేనే ప్రజల ఆదరణ లభిస్తుందని, తద్వారా పార్టీ లక్ష్యాలను చేరుకోగలమని కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేశారు.








