Mahaa Daily Exclusive

  ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారుల అసభ్య కంటెంట్ ప్రకటనలు.. మెటాకు కేంద్రం నోటీసులు…

Share

ఢిల్లీ, మహా

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలు దర్శనమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ.. తక్షణమే వివరణ ఇవ్వాలంటూ మాతృసంస్థ మెటాకు తాజాగా నోటీసులు జారీ చేసింది. అత్యంత సున్నితమైన ఇలాంటి ప్రకటనలను ప్లాట్‌ఫామ్‌పై అసలు ఎలా అనుమతించారో సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో నిలదీసింది. భవిష్యత్తులో ఇలాంటి అసభ్యకరమైన యాడ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు సంస్థాగతంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో కూడా స్పష్టం చేయాలని కేంద్రం ఆదేశించింది.

భారత్‌లోని పలు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విక్రయాల ప్రకటనలు వస్తున్నాయంటూ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బీబీసీ’ ఇటీవల ఓ సంచలన పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. ఈ ప్రకటనలన్నీ పలు టెలిగ్రామ్ ఛానళ్లకు లింక్ అయి ఉన్నాయని, కేవలం రూ. 99లకే ఈ అసభ్య కంటెంట్ లభిస్తుందంటూ అందులో యాడ్స్ ఉన్నట్లు సదరు కథనం వెల్లడించింది.

ఈ కథనం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం తీరుపైనా సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. బీబీసీ కథనం ప్రచురితమైన 24 గంటల తర్వాత గానీ ఇన్‌స్టాగ్రామ్ ఈ వ్యవహారంపై స్పందించలేదని తెలిసింది. నిబంధనలను ఉల్లంఘించిన సదరు అకౌంట్లను సస్పెండ్ చేశామని మాత్రమే సంస్థ బదులిచ్చింది. సోషల్ మీడియా వేదికల ఉదాసీన వైఖరిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఉదంతంపై పూర్తి స్థాయి వివరణ కోరుతూ మెటాకు నేరుగా నోటీసులు జారీ చేసింది. చిన్నారుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఈ కఠిన చర్యల ద్వారా కేంద్రం స్పష్టం చేసింది.

Latest