- నేను చెప్పినవి అబద్ధాలైతే రాజీనామాకు సిద్ధం.
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు మంత్రి జూపల్లి సవాల్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర అప్పుల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు సవాల్ విసిరిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సాయంత్రం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. తాను విసిరిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని, వెనకడుగు వేసి పారిపోయే వ్యక్తిని కానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బహిరంగ చర్చకు రావాలంటూ ఉదయం సవాల్ చేసిన ఆయన.. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని ప్రతిపక్ష నేతల కోసం మూడు కుర్చీలు వేసి మరీ ఎదురుచూశారు.
ప్రెస్‌క్లబ్‌లో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు నాలుగు పేజీల చొప్పున ఆధారాలతో సహా వాట్సాప్‌లో లేఖలు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర అప్పు రూ. 8.21 లక్షల కోట్లు అని తాను లేఖలో స్పష్టంగా పేర్కొనగా, మాజీ మంత్రి హరీశ్‌రావు మాత్రం అప్పు రూ. 4.17 లక్షల కోట్లేనంటూ తిరుగు లేఖ పంపారని విమర్శించారు. నేరుగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను లేఖలో ప్రస్తావించిన అంశాలు అబద్ధాలని నిరూపించగలరా అని ఆయన సవాల్ చేశారు. పారిపోవడం తమ ఇంటావంటా లేదని ఆయన ఉద్ఘాటించారు.
తాను చెప్పిన లెక్కలు అబద్ధమైతే పదవికి రాజీనామా చేసేందుకు సైతం సిద్ధమని జూపల్లి ప్రకటించారు. హరీశ్‌రావు రాసిన లేఖలో ఎలాంటి విషయం లేదని, తన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ ఆయన ‘సొల్లు పురాణం’ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు అంగీకరించి విలువలతో బతకాలని హితవు పలికారు.
మరోవైపు మంత్రి జూపల్లి సవాల్‌పై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. చర్చకు రావాలని పదేపదే సవాళ్లు విసురుతూనే, మరోవైపు భయపడి పోలీసులతో తమను అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి సవాళ్లకు బదులుగా దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర అప్పుల వ్యవహారంపై అక్కడే చర్చించాలని బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








