- సామాజిక మాధ్యమాల్లో విపరీత ధోరణులపై కీలక చర్చ.
అమరావతి , మహా.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. విజయవాడలోని లోక్ భవన్‌లో సాయంత్రం జరిగిన ఈ భేటీ అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలపై ఇరువురి మధ్య కీలక, ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం గవర్నర్ మార్గదర్శకత్వం, ఆయన అందించిన ఆతిథ్యం పట్ల పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ భేటీలో ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యక్తులు పాల్పడుతున్న వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారాల తీరును పవన్ కల్యాణ్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. సమాజంలో ఇలాంటి విపరీత ధోరణులు పెరిగిపోతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం తరఫున చట్టపరంగా తీసుకోబోయే కఠిన చర్యలను గవర్నర్‌కు వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తేనే ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయగలమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీత ధోరణులు శృతిమించాయి. కొందరు తమకు నచ్చకపోతే ఇష్టమొచ్చిన రీతిలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, బూతులు తిట్టడం వంటి అతి పోకడలకు పాల్పడుతున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఇలాంటి వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆకతాయిల ఆటకట్టించేందుకు ప్రభుత్వం తీసుకోబోయే కఠిన చర్యలపై ఆయన గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది.
గవర్నర్‌తో సమావేశానికి ముందు పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సైబర్ క్రైమ్ ఐజీ, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ‘ఈగల్’ విభాగం చీఫ్ ఆకే రవికృష్ణతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘ఈగల్’ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను ఐజీ ఆయనకు లాంఛనంగా సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల మహమ్మారిని అణచివేసేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలను ఉపముఖ్యమంత్రికి వివరించారు. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారు, ట్రోలింగ్‌కు పాల్పడే వారిపై సైబర్ క్రైమ్ విభాగం తీసుకుంటున్న చర్యల గురించి ఐజీ ఆయనకు సవివరంగా తెలియజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని ఈ సమావేశాల ద్వారా స్పష్టమవుతోంది.








