- 62 ఆలయాల్లో నిత్యాన్నదానం.
- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి .
నెల్లూరు, మహా.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రస్తుతం 62 ఆలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,200 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్య కార్యక్రమాల నిర్వహణ కోసం నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఆదివారం నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
పలు ఆలయాలకు శంకుస్థాపనలు
పర్యటనలో భాగంగా పెరుమూళ్లపాడులోని నాగలింగేశ్వరస్వామి ఆలయం, చేజర్లలోని చెన్నకేశవస్వామి ఆలయం, చిత్తలూరు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
‘పురాతన ఆలయాల పునరుద్ధరణ అదృష్టం’
పురాతన దేవాలయాల పునరుద్ధరణలో భాగస్వామి కావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి ఆనం అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, దేవాదాయ శాఖ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
పెరుగుతున్న భక్తుల రద్దీ
గతంతో పోలిస్తే రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తుల రాక గణనీయంగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా సుమారు 24 లక్షల మంది భక్తులకు ఆలయాల్లో నిత్యాన్నదానం అందిస్తున్నామని వెల్లడించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని చెప్పారు.
గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. గోదావరి నది తీరంలోని ఆలయాల మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని వెల్లడించారు. పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆధ్యాత్మిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, నిత్యాన్నదాన కార్యక్రమాల విస్తరణ ద్వారా రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందిస్తామని ఆయన తెలిపారు.







