మణుగూరు, మహా : మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఈ రోజు డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పదేళ్ల క్రితమే పరిపాలనా అనుమతులు లభించినప్పటికీ, నిధుల కొరతతో వాయిదా పడుతూ వచ్చిన ఈ నిర్మాణాన్ని సింగరేణి సంస్థ, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మరియు భాగస్వాముల సమిష్టి కృషితో పూర్తి చేసినట్లు డీజీపీ వివరించారు. ఈ సందర్భంగా స్టేషన్ భవనాన్ని పరిశీలించిన అధికారులకు, అందులో ఏర్పాటు చేసిన మిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు ఆధునిక సదుపాయాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో జరిగిన సమావేశంలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగంపై దృష్టి
సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీలు, సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఆధునిక సాంకేతికత, ముఖ్యంగా కృత్రిమ మేధస్సును విరివిగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. నేర పరిశోధనలో సమర్థత పెంచేందుకు సి.సి.టి.ఎన్.ఎస్ 3.0 లో సమాచారాన్ని సకాలంలో నమోదు చేయడం అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. మెరుగైన మౌలిక వసతులు ఫిర్యాదుదారుల్లో విశ్వాసాన్ని నింపడమే కాకుండా, సిబ్బందికి అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పిస్తాయని సందర్శకుల పుస్తకంలో నమోదు చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి పోలీస్ బాస్ వరకు ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల నిర్మూలనకు ఉక్కు సంకల్పంతో పనిచేయాలని డీజీపీ పిలుపునిచ్చారు. భావి తరాలను ఈ మహమ్మారి నుంచి కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల విక్రేతలు, సాగుదారులను నక్సలైట్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులుగా గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి, రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.








