Mahaa Daily Exclusive

  పార్టీలు వేర్వేరు అయినప్పటికీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది..రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..

Share

  • పార్టీలు వేర్వేరు అయినప్పటికీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది
  • ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత…
  • రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం జూలై 7 మహా:

పార్టీలు వేర్వేరు అయినప్పటికీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రూ.338 కోట్ల వ్యయంతో ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (HAM) విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు లేన్ల రహదారుల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.

 

అనంతరం నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తనపై ఉంచిన విశ్వాసం వల్లే రాష్ట్రంలో కీలకమైన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా సేవ చేసే అవకాశం లభించిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే రూ.85 కోట్ల విలువైన రహదారి పనులు పూర్తి చేశామని, మరో రూ.275 కోట్లతో పలు రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అదనంగా రూ.100 కోట్ల విలువైన కొత్త రహదారి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

పార్టీలు వేర్వేరు అయినప్పటికీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, జాతీయ రహదారుల విస్తరణ, వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

 

పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.338 కోట్లతో 140కు పైగా రహదారి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాలు, బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. లక్ష్మీరెడ్డిపాలెం వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

 

ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రూ.338 కోట్ల విలువైన రహదారి పనులు మంజూరు కావడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇందులో సుమారు రూ.275 కోట్ల పనులు నేరుగా ఇబ్రహీంపట్నం పరిధిలో చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 200 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, రహదారుల విస్తరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే రూ.2,300 కోట్లతో సమీకృత మార్కెట్ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖ ద్వారా భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఉపాధి, పెట్టుబడులు, ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TUFIDC) చైర్మన్‌ చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏఎంసీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈసీ శేఖర్ మామ, కొషికే ఐలయ్య, కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, మరి నిరంజన్ రెడ్డి, కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, రాచర్ల వెంకటేశ్వర్లు, భూపతిగళ్ల మహిపాల్, సిహెచ్ భాస్కరాచారి, రమాకాంత్ రెడ్డి, కాకుమాను సునీల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest