Mahaa Daily Exclusive

  ప్రజాప్రతినిధి ముసుగులో భూస్వాహా..! పాయల్ కబ్జాలపై ప్రధాన మీడియాలో కథనాలు..

Share

  • ప్రజాప్రతినిధి ముసుగులో భూస్వాహా
  • బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ‘కబ్జా’ పర్వం!
  • ప్రజాసేవకుడా? లేక భూములు కొల్లగొట్టే వేటగాడా?
  • అదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపుతున్న అసైన్డ్ భూముల దందా
  • అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తిన వైనం
  • పాయల్ కబ్జాలపై ప్రధాన మీడియాలో కథనాలు

తెలంగాణ బ్యూరో, మహా : ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి, ఆశ్రిత పక్షపాతానికి, అక్రమార్జనకు పాల్పడితే సమాజం ఏమైపోవాలి? ప్రజల సొమ్మును, పేదల భూములను కాపాడాల్సిన బాధ్యత కలిగిన పదవిలో ఉండి, స్వయంగా భూ కబ్జాకు పాల్పడటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సంబంధించిన భూబాగోతంపై తాజాగా పలు మీడియాలలో కథనాలు రాగా, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

 

అక్రమాల పునాదులపై ఆస్తుల సౌధం

 

ఆదిలాబాద్ మండలంలోని బట్టిసవర్గం గ్రామ పరిధిలో, నూతన కలెక్టరేట్ భవనానికి కూతవేటు దూరంలో ఉన్న సుమారు ఏడెకరాల విలువైన అసైన్డ్ భూమిని, మరో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని తన భార్య పేరుతో పాయల్ శంకర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధి స్థాయి వ్యక్తి, చట్టాలకు అతీతంగా వ్యవహరించి, ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

 

చట్టాన్ని బేఖాతరు చేసిన వైనం

 

నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములను అమ్మడానికి, కొనడానికి వీలులేదు. గతంలోనే ఈ భూములకు సంబంధించి నిలిపివేత ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని తుంగలో తొక్కి, ఏకంగా ప్లాట్లుగా మార్చి రిజిస్ట్రేషన్లు చేయించడం ఆయన అధికార దర్పానికి నిదర్శనం. అంతేకాకుండా, గతంలో రద్దయిన ఎన్ఓసీ ని మళ్ళీ తెరపైకి తెచ్చి, అధికారులను మేనేజ్ చేసి, ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయించడం వెనుక పెద్ద కుట్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు రూ. 5 కోట్ల విలువైన 11 ప్లాట్లను తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న పాయల్ శంకర్, ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు? అధికారుల సహకారంతో నకిలీ రికార్డులను సృష్టించి, పేద రైతుల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన వైనం, ఆ ప్రజాప్రతినిధి నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది.

 

ప్రశ్నించని అధికారులు

 

ఏ బాధ్యతాయుతమైన అధికారి అనుమతితో ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి, ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే కళ్లు మూసుకుని కూర్చున్నారా? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భూభారతి పోర్టల్‌లో ఆంక్షలు ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే అంశంపై సమగ్ర విచారణ జరగాలని, బాథ్యులు కఠినంగా శిక్షించబడాలని ప్రజలు కోరుతున్నారు.

Latest