Mahaa Daily Exclusive

  సింగరేణిపై ప్రేముంటే గోదావరి లోయ బ్లాకులన్నీ కేటాయించాలి.. ఆధారాలతో సహా కేంద్రం తీరును ఎండగట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Share

  • తాడిచెర్ల కొత్త కేటాయింపు కాదు.. పాతదానికే అనుమతి
  • ప్రైవేట్ వారికి ఇచ్చిన బ్లాకులను వెనక్కి తీసుకుని సింగరేణికి ఇవ్వాలి
  • గిరిజన ప్రాంతాల్లో బొగ్గు బ్లాకుల వేలం చట్టవిరుద్ధం
  • ఆధారాలతో సహా కేంద్రం తీరును ఎండగట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

సింగరేణి కాలరీస్ సంస్థకు తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను మరుగున పరిచి, తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సింగరేణికి 2013లో కేటాయించిన తాడిచర్ల -2 బ్లాకును మళ్లీ సింగరేణికి కేటాయిస్తున్నట్టు కేంద్ర బొగ్గుగనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటికే కేటాయించిన తాడిచర్ల-2 బ్లాక్ కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మంజూరు చేసింది కేవలం లీజు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 2013లో కేటాయించిన తాడిచర్ల-2 బ్లాక్ ను ఇప్పటివరకు లీజు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేసిందని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి దీనిపై కేంద్రానికి లేఖలు రాస్తున్నామని చెప్పారు.

ప్రజా ప్రభుత్వ కృషి వల్లనే కేంద్రం లీజుకు అనుమతి ఇచ్చిందని అన్నారు. మహాత్మా జ్యోతీబా ఫూలే ప్రజా భవన్ లో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో తాడిచర్ల – 2 బ్లాక్, సింగరేణికి మంజూరు చేయాల్సిన బ్లాకులపై ఆధార పత్రాలతో సహా కూలంకషంగా వివరించారు.

 

సింగరేణికి 2010 నుంచి 2012 వరకు కేంద్ర బొగ్గు శాఖకు చేసిన విజ్ఞప్తులపై స్పందిస్తూ నాటి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 2013 సెప్టెంబర్ 16న తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ ను సింగరేణి సంస్థకు కేటాయించిందన్నారు. కేటాయింపు లేఖలో స్పష్టంగా ఈ బ్లాకులో గిరిజన భూములు ఉన్నందున వాటిని ప్రభుత్వ రంగ సంస్థలే బొగ్గును తీయాలని పేర్కొందన్నారు. ఈ బ్లాకుల అన్వేషణ, అభివృద్ధి పనులు వేగంగా చేసి వీలైనంత త్వరగా బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నాడు కేంద్ర ప్రభుత్వం ఈ కేటాయింపు లేఖలో సింగరేణికి సూచించింది.

ఈ నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను పలుమార్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసినట్లు చెప్పారు. సింగరేణికి మంజూరైన తాడిచర్ల-2 బ్లాక్ కు మైనింగ్ లీజు ముందస్తు అనుమతులు ఇవ్వాలని పలుమార్లు లేఖలు రాసినట్లు చెప్పారు.

 

2024 మార్చి 7న తాను స్వయంగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానని,

2026 మే 20న మరో సారి బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి మైనింగ్ లీజు మంజూరుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరినట్లు వివరించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాము ఎన్నోసార్లు చేసినప్పటికీ నాన్చుడు ధోరణితో ఇప్పటివరకు మైనింగ్ లీజుకు అనుమతించకుండా జాప్యం చేసారని అన్నారు. ఇప్పుడు కొత్తగా బ్లాకును కేటాయిస్తున్నట్టు ప్రకటించటం విచారకరమని పేర్కొన్నారు. మైనింగ్ అనుమతులు ఆలస్యం అవ్వటం వలన సింగరేణి సంస్థ ఆ గనిని ప్రారంభించ లేకపోయిందని అన్నారు. ఈ కారణం వల్ల సంస్థకు అపార నష్టం కలిగిందన్నారు. ఇప్పటికైనా మైనింగ్ లీజుకు ముందస్తు అనుమతి ఇవ్వటం మంచి పరిణామం అని అన్నారు.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, ఇల్లందు వంటి సింగరేణి ప్రాంతాలు 1/70 గిరిజన చట్టం పరిధిలోకి వస్తాయని చెప్పారు. ఇక్కడ గిరిజనులు మాత్రమే భూమిపై సర్వ హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే మైనింగ్ వంటి కార్యకలాపాలు చేసుకునే హక్కు కలిగి ఉంటాయన్నారు. ఈ విషయాలు చట్టంలో స్పష్టంగా చెప్పబడినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇల్లందు సమీపంలోని కోయగూడెం-3 ఓపెన్ కాస్ట్ బ్లాక్ ను, మణుగూరులోని ఓపెన్ కాస్ట్ డిప్ సైడు గనిని వేలం పాటలో పెట్టడం చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని గట్టిగా విమర్శించారు.

 

గిరిజన చట్టం అమలులో ఉన్న సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు మాత్రమే కేటాయించడం సమంజసమని అన్నారు. సింగరేణి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కనుక.. ఇక్కడ బొగ్గు తవ్వి తీసే అధికారం కేవలం సింగరేణికే ఉంటుందని పలు లేఖల ద్వారా కేంద్రానికి చెప్పామని అన్నారు.

 

సింగరేణి సంస్థపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ప్రేమ ఉంటే సింగరేణి విస్తరించిన గోదావరి లోయ ప్రదేశంలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరారు. ఈ మేరకు సింగరేణి సంస్థతో పాటు తాము కూడా పలు బొగ్గు బ్లాకుల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర బొగ్గు శాఖకు చెబుతూ వస్తున్నామని వివరించారు.

 

నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రైవేటు వారికి కేటాయించిన కోయగూడెం-3 ఓపెన్ కాస్ట్ బ్లాక్ అలాగే సత్తుపల్లి ఓపెన్ కాస్ట్-3 బ్లాక్ లలో ఇప్పటివరకు మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించలేదన్నారు. వాటిని తక్షణమే సింగరేణికి అప్పగించాలని ఆయన అన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని బొగ్గు బ్లాక్ లను వేలం పాటలో ఉంచకుండా సింగరేణికి కేటాయించాలని ఆయన చెప్పారు. ఇక్కడ ఉన్న గిరిజన చట్టాలు స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు శాఖ సింగరేణికి నేరుగా కేటాయించడం ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ( జి టు జి) అనే పద్ధతిలో సమంజసంగా ఉంటుందన్నారు.

 

ఈ మీడియా సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest