హైదరాబాద్, మహా
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదురుతున్నాయి. దేవాదాయ శాఖ వ్యవహారాలతో పాటు జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ తాజాగా స్పందించారు.
వివాదం పరిష్కారానికి ఆసక్తి కనిపించలేదు
తాను, తన భర్త కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించామని మంత్రి సురేఖ తెలిపారు. అయితే ఆయన వ్యవహార శైలి చూస్తుంటే వివాదాన్ని పరిష్కరించాలన్న ఆసక్తి కనిపించలేదన్నారు. తాను ఇంట్లో ఉండగా బయటకు రావాల్సిన పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
జూలై 14న కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌ను కలుస్తా
ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 14న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు వివరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి అన్ని అంశాలను తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.
మంత్రి బాధ్యతల్లో జోక్యం ఎందుకు?
మంత్రి చేయాల్సిన పనులను ఎమ్మెల్యే చేయడం సరికాదని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. గత మూడు నెలలుగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, అందువల్లే కొన్ని సమావేశాలకు హాజరుకావాల్సి వచ్చిందని అధికారులు తనకు వివరించినట్లు తెలిపారు. ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
చర్యలు తీసుకుంటామని హామీ
తాను ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. తన రాజకీయ జీవితం మొత్తం ఎన్నో ఒడిదుడుకులతో సాగిందని, ఇప్పటికీ అదే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.








