Mahaa Daily Exclusive

  మరోసారి చేతిలో డైరీతో సీఎం విజయ్..! ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ..!

Share

చెన్నై, మహా.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి చేతిలో డైరీతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో డైరీలో నోట్స్ రాసుకుంటూ వార్తల్లో నిలిచిన ఆయన, ఈసారి చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మహిళా, శిశు ఆసుపత్రిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీ సందర్భంగా కూడా చేతిలో డైరీతో కనిపించారు. ఆసుపత్రిలోని పరిస్థితులను నేరుగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆరోగ్య శాఖ మంత్రి కె.జి. అరుణ్‌రాజ్, ఉన్నతాధికారులతో కలిసి ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి విజయ్, ప్రసూతి, గైనకాలజీ వార్డులతో పాటు పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆసుపత్రి నిర్వహణలో ఉన్న లోపాలను డైరీలో నమోదు చేసుకుంటూ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

పర్యటన సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి విజయ్ నేరుగా మాట్లాడారు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లపై చర్చించారు.

ఇటీవల ఈ ఆసుపత్రిలో లంచాల డిమాండ్, పారిశుద్ధ్య లోపాలకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. లోపాలను వెంటనే సరిదిద్దాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పర్యటనలో భాగంగా ప్రసవానంతర వార్డులను సందర్శించిన ముఖ్యమంత్రి విజయ్ బాలింతలతో ఆత్మీయంగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్య సేవలపై అభిప్రాయాలు అడిగారు. ఈ సందర్భంగా కొందరు నవజాత శిశువులను చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా ముద్దాడారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి.

ఇటీవల తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో చేతిలో డైరీతో కనిపిస్తూ ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్న ముఖ్యమంత్రి విజయ్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆసుపత్రి తనిఖీలోనూ అదే డైరీతో కనిపించడం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. .

Latest