- బీఆర్ఎస్ ఖాతాలో సొమ్మంతా అవినీతిదే
- ఖాతాలోని రూ. 1400 కోట్లు అమర వీరుల కుటుంబాలకు పంచాలి
- ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీలో చేరను
- కాళేశ్వరం అనకొండ హరీష్ రావు
- అధికారంలోకి రాగానే ఫినిక్స్ సంస్థతో పాటు భూకేటాయింపులపై సమీక్షిస్తాం
- సింగరేణి బాయిబాట కార్యక్రమం సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు
కొత్తగూడెం, మహా : తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జత కట్టేది లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ. 1400 కోట్లు అవి క్విడ్ ప్రో క్రో కింద ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చిన సొమ్ములు కాదా అని ప్రశ్నించిన కవిత.. ఆ సొమ్మును అమర వీరుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పంచాలని ఆమె డిమాండ్ చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వివిధ సంస్థలకు అప్పగించిన భూముల వివరాలను రివ్యూ చేస్తామని కవిత తెలిపారు. తాను ప్రజల్లో ఉండే పోరాడతానన్న కవిత.. తల్లి, చెల్లి అనే ఇంగితం మర్చిపోయి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారన్న ఆమె.. మర్యాద పాటించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ సోషల్ మీడియాకు హెచ్చరికలు జారీ చేశారు. తమ పార్టీలోని యువత వ్యక్తిగత కామెంట్ల జోలికి పోరన్న కవిత.. లైన్ దాట్టొదని బీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరించారు.
తమ పార్టీతో భయం లేదంటూనే ఎన్నికల సంఘానికి వెయ్యికిపైగా ఫిర్యాదులు ఇచ్చారని, టీఆర్ఎస్ అనే పేరు తనకు రాకుండా ఉండటం కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్ రావును కాళేశ్వరం అనకొండ అంటూ సంచలన ఆరోపణలు చేసిన కవిత.. ఆయన్ను బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోందన్నారు. కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్కు క్విడ్ ప్రొ కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారని కవిత ఆరోపించారు. ఫినిక్స్ సంస్థకు 80 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారని ఆరోపించిన కవిత.. ఆ సంస్థ 33 లక్షల టన్నుల కలప కొట్టేస్తోందన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన కేసులను కూడా పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమికి ఇంకా అదనంగా ఈ ప్రభుత్వం కూడా భూమి ఇస్తోందన్న కవిత.. అవినీతి విషయంలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పగించిన భూములు అన్నింటిపైనా రివ్యూ చేస్తామన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో చిన్న కాంట్రాక్టర్లు, స్కూల్ యాజమాన్యాలు ఎంత ఖర్చు చేశాయన్న కవిత.. తెలంగాణ సాధించిన తర్వాత వారికి న్యాయం జరగాలని తాను బీఆర్ఎస్లో ఉండి కొట్లాడానన్నారు. అప్పుడు కూడా తాను ఉద్యమకారులు, కార్మికుల కోసం ఫైట్ చేశానని చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనూ తాను ఉద్యమకారుల పక్షాన నిలబడ్డానని కవిత తెలిపారు కానీ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు చేస్తున్న మోసాన్ని డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని తెర మీదకు తెచ్చిందన్న కవిత.. సీఎం రేవంత్ రెడ్డికి సాగునీటి అంశాల పట్ల కనీస అవగాహన లేదన్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా అర కిలోమీటర్ రాళ్ల గోడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చని కవిత చెప్పారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎత్తి పోసుకోవచ్చన్నారు. కానీ గత ప్రభుత్వంపై కక్షతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
సింగరేణిలో ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైన్ అనే హెల్త్ మిక్స్ ఉండాలని.. అప్పుడే సంస్థ బాగుంటుందని కవిత అభిప్రాయపడ్డారు. సింగరేణి ఇబ్బందుల్లో ఉండటానికి ఈ ప్రభుత్వమే కారణమని, సంస్థకు ఇవ్వాల్సిన రూ. 54 వేల కోట్లు ఇవ్వకపోవటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపించారు. సింగరేణిలో వన్ విజన్, వన్ ఫ్యామిలీ అంటారు. కానీ ఆఫీసర్లకు ఒక రూల్, కార్మికులకు ఒక రూల్ నడుస్తోందన్నారు. సింగరేణికి నిజాం 17 గనులను రాసిచ్చారన్న కవిత.. యూపీఏ హయాంలో జరిగిన భూ కుంభకోణం కారణంగా బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను జాతీయం చేసిందని.. తద్వారా 17 బొగ్గు గనులను కేంద్రం లాక్కుందన్నారు. సింగరేణికి తాడిచర్ల గనిని ఇచ్చిన కేంద్రం మిగతా 16 గనులను కూడా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.








