యాదాద్రి భువనగిరి, మహా.
దేశంలో ఆరోగ్య రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో దేశ ఆరోగ్య రంగంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
ఒకే ఎయిమ్స్ నుంచి 23 ఎయిమ్స్‌ల వరకు దేశ ప్రస్థానం
ఇరవయ్యో శతాబ్దం చివరి వరకు దేశంలో న్యూఢిల్లీలో మాత్రమే ఒకే ఎయిమ్స్ సంస్థ ఉండేదని నడ్డా గుర్తు చేశారు. అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మరో ఆరు ఎయిమ్స్‌లకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అయితే 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను విస్తరించే లక్ష్యంతో ఎయిమ్స్‌ల సంఖ్యను 23కు పెంచినట్లు వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం 18 సంస్థలు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తుండగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు.
ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు సమగ్ర ఆరోగ్య వ్యవస్థ
దేశంలో ఆరోగ్య సేవలను గ్రామీణ స్థాయి నుంచి అత్యున్నత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల వరకు అనుసంధానం చేస్తూ బలమైన ఆరోగ్య వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని నడ్డా వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.85 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్రతిరోజూ సుమారు 15 లక్షల మందికి ప్రాథమిక వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. గతంలో దేశంలో 370 మాత్రమే ఉన్న వైద్య కళాశాలల సంఖ్య ప్రస్తుతం 820కు చేరిందని పేర్కొన్నారు.
నాలుగేళ్లలోనే బీబీనగర్ ఎయిమ్స్ అద్భుత ప్రగతి
జూన్ 2022లో మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్ కేవలం నాలుగేళ్లలోనే విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అన్నారు. ఈ సంస్థ అభివృద్ధి కోసం రూ.1,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.110 కోట్ల వ్యయం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ 132 మంది అధ్యాపకులు, 133 మంది సీనియర్ వైద్యులు సేవలందిస్తున్నారని తెలిపారు.
వైద్య విద్యలో విస్తరణ
బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ విద్యతో పాటు 24 విభాగాల్లో వైద్య స్నాతకోత్తర కోర్సులు, ఐదు విభాగాల్లో అత్యున్నత సూపర్ స్పెషాలిటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని నడ్డా వివరించారు. దేశానికి అత్యుత్తమ వైద్యులను తయారు చేసే విద్యాసంస్థగా ఈ సంస్థ వేగంగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
రోజుకు 1,800 మంది రోగులకు వైద్య సేవలు
ఎయిమ్స్ బీబీనగర్ బాహ్య రోగుల విభాగంలో అన్ని ప్రధాన వైద్య విభాగాలు పనిచేస్తున్నాయని, ప్రతిరోజూ సుమారు 1,800 మంది రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. అంతర్గత వైద్య సేవలు, అత్యవసర వైద్య విభాగంతో పాటు అత్యాధునిక సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎముకల సాంద్రత పరీక్ష వంటి ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
డిజిటల్ వైద్యంలోనూ ముందంజ
ఈ-సంజీవని టెలిమెడిసిన్ సేవల ద్వారా ఇప్పటివరకు 1.56 లక్షల మందికి పైగా రోగులకు వైద్య సలహాలు అందించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు కూడా బీబీనగర్ ఎయిమ్స్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
పరిశోధనలకు కేంద్రంగా ఎయిమ్స్
బీబీనగర్ ఎయిమ్స్ కేవలం వైద్య సేవల కేంద్రం మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థగా కూడా రూపుదిద్దుకుంటోందని నడ్డా తెలిపారు. పరిశోధనల కోసం ఇప్పటివరకు రూ.64 కోట్ల గ్రాంట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం 129 పరిశోధన ప్రాజెక్టులపై పనులు కొనసాగుతుండగా, అధ్యాపకులు 156 పరిశోధనా పత్రాలను అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించినట్లు వివరించారు.
దేశంలో తొలి కమ్యూనిటీ రేడియోతో ప్రత్యేక గుర్తింపు
దేశంలోని ఎయిమ్స్ సంస్థల్లో తొలిసారిగా కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ప్రారంభించిన ఘనత బీబీనగర్ ఎయిమ్స్‌కే దక్కిందని నడ్డా పేర్కొన్నారు. ఈ సంస్థ ఆరు గ్రామాలను దత్తత తీసుకుని ఇప్పటివరకు 547 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి 66,148 మంది గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించిందని తెలిపారు.
డిసెంబర్ నాటికి పూర్తి స్థాయి నిర్మాణం
ఎయిమ్స్ నిర్మాణ పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, ప్రస్తుతం మొత్తం పనుల్లో 87 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. మిగిలిన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి 2026 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పనుల పురోగతిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతి వారం, కేంద్ర అదనపు కార్యదర్శి ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్షిస్తున్నారని తెలిపారు.
పాత భవనాన్ని అత్యాధునిక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం
బీబీనగర్‌లోని భవనం 2008లో వేరే అవసరాల కోసం నిర్మించినదని, దానిని ఎయిమ్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని నడ్డా వివరించారు. రీస్ట్రక్చరింగ్, రెట్రోఫిట్టింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, రేడియోగ్రఫీ విభాగాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
దక్షిణ భారత వైద్య రంగంలో అగ్రగామి సంస్థగా బీబీనగర్ ఎయిమ్స్
ఢిల్లీ ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి రెండు దశాబ్దాలు పట్టిందని గుర్తుచేసిన నడ్డా, బీబీనగర్ ఎయిమ్స్ మాత్రం కేవలం నాలుగేళ్లలోనే విశేష పురోగతి సాధించిందని కొనియాడారు. సాధారణంగా ఒక జాతీయ వైద్య విద్యాసంస్థ పూర్తిస్థాయిలో స్థిరపడటానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రాధాన్యంతో బీబీనగర్ ఎయిమ్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సంస్థ దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధనలకు కేంద్రంగా నిలిచి దేశానికి ఆదర్శ సంస్థగా అవతరిస్తుందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు.







