Mahaa Daily Exclusive

  ప్రపంచ వాయుసేనల ర్యాంకింగ్స్‌లో భారత్‌కు మూడో స్థానం….

Share

ఢిల్లీ, మహా.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వాయుసేనల జాబితాలో భారత వాయుసేన మరోసారి తన ప్రతిభను చాటుకుంది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ విడుదల చేసిన 2026 గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్‌లో భారత వాయుసేన మూడో స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా ఐదో ఏడాది కూడా చైనా వాయుసేనను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం భారత్ రక్షణ సామర్థ్యానికి మరో గుర్తింపుగా నిలిచింది.

ఈ ర్యాంకింగ్స్‌లో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, రష్యా రెండో స్థానాన్ని దక్కించుకుంది. స్వతంత్ర జాతీయ వాయుసేనల పరంగా పరిశీలిస్తే అమెరికా, రష్యాల తర్వాత ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతమైన వాయుసేనగా భారత వాయుసేన నిలిచినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత వాయుసేనకు 69.4 పాయింట్ల ట్రూ వాల్యూ రేటింగ్ లభించగా, చైనా వాయుసేన 63.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

విమానాల సంఖ్య మాత్రమే కాకుండా వాటి నాణ్యత, సాంకేతిక సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత, పైలట్ల శిక్షణ, నిర్వహణ వ్యవస్థ, లాజిస్టిక్స్, భవిష్యత్ ఆధునికీకరణ ప్రణాళికలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను నిర్ణయించారు. ఈ సమగ్ర మూల్యాంకనంలో భారత వాయుసేన మెరుగైన ప్రతిభ కనబరచడం వల్లే చైనాపై మరోసారి ఆధిక్యం సాధించింది.

ప్రస్తుతం భారత వాయుసేన వద్ద సుమారు 1,716 విమానాలు ఉన్నాయి. వీటిలో యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, ప్రత్యేక మిషన్ విమానాలు సమతుల్యంగా ఉండటం వాయుసేన బలాన్ని మరింత పెంచుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విస్తృత కార్యాచరణ సామర్థ్యం, నిరంతర ఆధునికీకరణ చర్యలు భారత వాయుసేనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయి.

అయితే భారత వాయుసేన ముందున్న సవాళ్లు కూడా కొనసాగుతున్నాయి. దేశ భద్రతా అవసరాలకు 42 ఫైటర్ స్క్వాడ్రన్లు అవసరమవుతుండగా, ప్రస్తుతం 29 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ లోటును అధిగమించేందుకు ప్రభుత్వం 180 తేజస్ ఎంకే–1ఏ యుద్ధ విమానాల కొనుగోలును వేగవంతం చేయడంతో పాటు స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఆధునిక యుద్ధ విమానాలు, స్వదేశీ సాంకేతికత, మౌలిక సదుపాయాల విస్తరణతో భారత వాయుసేన మరింత శక్తివంతంగా మారే అవకాశాలు ఉన్నాయని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Latest