ఆసియా అండర్-23లో తెలంగాణకు స్వర్ణం.
* ప్రవల్లిక నరిమళ్లకు సీఎం రేవంత్ అభినందనలు.
హైదరాబాద్, మహా.
చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2026లో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణకు చెందిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ప్రతిష్ఠను చాటిన ప్రవల్లిక విజయం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు.
ప్రవల్లిక నరిమళ్ల నల్గొండలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె కృషి, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకాన్ని అందుకోవడం యువ క్రీడాకారులందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాపీ మేస్త్రీ కుమార్తె అయిన ప్రవల్లిక సంకల్పబలం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తన విజయంతో నిరూపించారని ప్రశంసించారు.
మహిళల 4×400 మీటర్ల రిలేలో ప్రవల్లికతో పాటు శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్‌లతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 33.62 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆతిథ్య దేశమైన చైనాను వెనక్కి నెట్టి భారత జట్టు అగ్రస్థానంలో నిలవడం విశేషంగా నిలిచింది.
అంతర్జాతీయ స్థాయికి చేరుకునే ముందే ప్రవల్లిక దేశీయ అథ్లెటిక్స్‌లో విశేష ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి పోటీల్లో 23 స్వర్ణాలతో పాటు మొత్తం 35 పతకాలను సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఆమెను తీర్చిదిద్దిన కోచ్‌ల సేవలను కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మొత్తం 16 పతకాలు సాధించడం మరో విశేషం. మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలతో భారత జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచిందని పేర్కొంటూ, దేశానికి కీర్తి తీసుకొచ్చిన అన్ని విభాగాల క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.








