Mahaa Daily Exclusive

  జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌తో సీఎం రేవంత్ భేటీ…

Share

హైదరాబాద్, మహా.
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశమై రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం, విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందేలా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు.
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షకు తావులేకుండా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.
నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర విద్య అందించే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సంఖ్యను మరింత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.
రాష్ట్రంలో ఎస్సీలకు వారి జనాభా నిష్పత్తికి మించి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలు, పరిపాలన, ఇతర కీలక రంగాల్లో ఎస్సీలకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనివల్ల సామాజిక న్యాయం మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఎస్సీల సంక్షేమం, విద్య, ఉపాధి, సామాజిక సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.