Mahaa Daily Exclusive

  పోలవరం పనులు వేగవంతం చేయాలి…అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

Share

విజయవాడ , మహా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, డ్యామ్ నిర్మాణంతో పాటు పునరావాసం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు.

సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఇప్పటివరకు సివిల్ పనుల్లో 89 శాతం పురోగతి సాధించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లో గ్యాప్–1, గ్యాప్–2 పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

ప్రాజెక్టుకు అనుబంధంగా చేపడుతున్న కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ టన్నెల్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టుకు చేరుకునే ప్రధాన రహదారులు, కుడి–ఎడమ గట్ల అభివృద్ధి పనులు, గండి పోచమ్మ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

భూ సేకరణ, పునరావాసం, పునరావాస–పరిహార ప్యాకేజీల అమలులో నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ హామీలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, పర్యాటక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టును దేశంలోనే ఒక గుర్తింపు పొందే అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు తాను పోలవరం ప్రాజెక్టును 37 సార్లు సందర్శించినట్లు తెలిపారు. అలాగే ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇప్పటివరకు 136 సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొంటూ, పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.