Mahaa Daily Exclusive

  విమాన టికెట్ ధరల నియంత్రణకు కొత్త నిబంధనలు…

Share

ఢిల్లీ, మహా.
విమాన టికెట్ ధరల్లో అనూహ్య పెరుగుదల, పండుగలు, అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌లైన్స్ వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణలో కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. విమాన ఛార్జీల నియంత్రణ, ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు సంబంధించి కొత్త విమానయాన నిబంధనలను సిద్ధం చేసినట్లు కోర్టుకు తెలిపింది.
సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం, కొత్త విమానయాన నిబంధనలను 30 రోజుల్లోగా పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. అయితే పార్లమెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా కొత్త నిబంధనల ముసాయిదా ప్రతిని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం వాటిని పరిశీలించి తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
పండుగలు, సెలవులు, ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచడంపై సుప్రీంకోర్టు గత విచారణల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేలా స్పష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని మరోసారి ధర్మాసనం పేర్కొంది.
విమాన ఛార్జీల నియంత్రణకు సంబంధించిన ప్రజాహిత వ్యాజ్యంపై తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటిలోగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ముసాయిదాను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే విమాన టికెట్ ధరల నిర్ణయంలో మరింత పారదర్శకతతో పాటు ప్రయాణికుల హక్కులకు రక్షణ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.