హైదరాబాద్, మహా : రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరుగురు హత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యూషన్ టీచర్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న రాజ్‌కుమార్, భార్య విడాకులు కోరిన కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజ్‌కుమార్ తనకంటే ఆరు సంవత్సరాలు పెద్ద అయిన సరిత వద్ద ట్యూషన్ చదివే సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో 2018లో రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వివాహం అనంతరం డ్రైవర్‌గా పనిచేసిన రాజ్‌కుమార్ ఆన్లైన్ గేమింగ్, జూదం, బెట్టింగ్‌లకు బానిసై భారీ అప్పులు చేశాడు. అప్పుల భారం తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అప్పులు తీర్చేందుకు కుటుంబ సభ్యులు పొలం విక్రయించి షాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేసి ఇచ్చారు. అయినప్పటికీ మళ్లీ అప్పులు చేయడంతో మిగిలిన పొలాన్ని కూడా విక్రయించినట్లు తెలుస్తోంది.
మద్యం సేవించి భార్యను వేధించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఈ నేపథ్యంలో సరిత పలుమార్లు పంచాయతీ పెట్టి విడాకులు కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న రాజ్‌కుమార్ భార్య, పిల్లలతో పాటు మొత్తం ఆరుగురిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.








