‘కూటమి’ ఉక్కుపాదం.
* ‘ఫేక్’ గొట్టం బాబుల భరతం పడుతున్న సర్కార్.
* పత్రికా స్వేచ్ఛ ముసుగులో రెచ్చిపోతే జైలుకే.
అమరావతి , మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలతో అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. గత ఐదేళ్లుగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని, పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన ఫేక్ యూట్యూబర్లు, సోషల్ మీడియా సైకోల ఆటలు కట్టించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల నేతృత్వంలోని సర్కార్ నడుం బిగించింది. సమాజంలో ద్వేషాన్ని రగిల్చి, వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజాస్వామ్య విలువలకే పాతరేసేలా అసత్య ప్రచారాలు చేసే వారికి ఇకపై ఏపీలో నూకలు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వ్యవస్థను భ్రష్టుపట్టించేలా వ్యవహరించిన ఒక ‘రావణుడి’ తరహా కరుడుగట్టిన యూట్యూబర్‌పై చట్టపరంగా కేసులు నమోదు చేసి, కటకటాల వెనక్కి నెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం తమ ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టింది. సమాజానికి చేటు చేసే శక్తులతో పెట్టుకుంటే చట్టబద్ధంగా రఫ్ ఆడించేస్తామని కూటమి సర్కార్ చేతల్లో చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లోని కలుపు మొక్కలను సమూలంగా ఏరివేస్తోంది.
ఈ చర్యల ద్వారా కేవలం ఒకరిద్దరిని అరెస్టు చేసి వదిలేయడం కాకుండా, వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. యూట్యూబర్ల పేరుతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే శక్తులు, వారి వెనుక ఉండి నడిపించే రాజకీయ అదృశ్య శక్తులు ఎంతగా గోల చేసినా, ప్రభుత్వ నిర్ణయాల్లో అణువంత కూడా మార్పు లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎక్కడా ఒక అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఒకసారి అడుగు ముందుకేశాక వెనక్కి తగ్గితే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందనే దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు. అందుకే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ మార్గదర్శకత్వంలో, రాష్ట్రంలో పౌరుల ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యూట్యూబర్లందరికీ పోలీసుల ద్వారా ముందస్తు నోటీసులు జారీ చేసే ఒక వినూత్నమైన, చట్టబద్ధమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం కాదని, స్వేచ్ఛ పేరుతో స్వైరవిహారం చేస్తున్న బ్లాక్ మెయిలర్లకు హద్దులు గుర్తుచేయడమేనని మేధావులు, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
ఏపీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు యూట్యూబర్ల ఇళ్లకు వెళ్లి అత్యంత మర్యాదపూర్వకంగా, అదే సమయంలో అంతే కఠినంగా న్యాయపరమైన నోటీసులు అందజేస్తోంది. ఈ నోటీసుల్లో కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు, చట్టాల పట్ల పూర్తి అవగాహన కల్పించేలా సమాచారం పొందుపరచడం కూటమి ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. పత్రికా స్వేచ్ఛ ముసుగులో హద్దులు దాటితే ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు? ఆయా సెక్షన్ల తీవ్రత ఎంత? నేరం రుజువైతే ఎలాంటి కఠిన శిక్షలు పడతాయి? తదితర వివరాలను ఆ నోటీసుల్లో సవివరంగా, కులంకషంగా వివరించారు. “మీడియా ముసుగులో ఏం మాట్లాడినా చెల్లుతుంది.. వ్యక్తిగతంగా ఎంత తిడితే అంత హీరోలమైపోతాం” అని విర్రవీగే వారికి, చట్టం తన పని తాను చేసుకుపోతుందనే స్పష్టమైన సందేశాన్ని సర్కార్ పంపింది. తప్పు చేసే ముందే చట్టం గురించి వివరించి, ఆ తర్వాత కఠినంగా వ్యవహరించాలన్న పోలీసుల తాజా వ్యూహం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే లాఠీలు, కేసుల మోతలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కొందరు పనిగట్టుకుని యూట్యూబ్ చానెళ్ల ద్వారా విషం చిమ్ముతున్న తరుణంలో, వారికి ముకుతాడు వేయడం ద్వారా నిజమైన జర్నలిస్టులకు, వాస్తవాలు మాట్లాడే వారికి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోంది. అరెస్టులకు ముందే ఇలా న్యాయపరమైన నోటీసులు ఇచ్చి, దారితప్పిన వారికి తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం అత్యుత్తమ పరిపాలనకు అద్దం పడుతోంది. మొత్తానికి, యూట్యూబ్ గొట్టాలు పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడే ‘ఫేక్’ బాబుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఇకపై ఏపీలో నోరు పారేసుకుంటే కేసుల బరువు మోయక తప్పదన్న భయం వారిలో మొదలైంది. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాధించిన నైతిక విజయమని, పవన్ కళ్యాణ్ నిబద్ధతకు, చంద్రబాబు పరిపాలనా దక్షతకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. చెత్తను శుభ్రం చేసి, స్వచ్ఛమైన సమాచార వ్యవస్థను నిర్మించడంలో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.








