Mahaa Daily Exclusive

  భోగాపురం విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు….

Share

భోగాపురం విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు.
* ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్ హోదా కల్పించిన కేంద్రం.
అమరావతి , మహా.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రారంభానికి ముందే కేంద్ర ప్రభుత్వం కీలక గుర్తింపు కల్పించింది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం–2025 పరిధిలో భోగాపురం విమానాశ్రయాన్ని చేర్చుతూ కేంద్ర హోంశాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ విమానాశ్రయానికి అధికారికంగా ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్ హోదా లభించడంతో పాటు దేశంలోని టు కేటగిరి–1 విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానాన్ని దక్కించుకుంది.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ పేరుతో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భోగాపురం విమానాశ్రయం ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులకు అవసరమైన ఇమిగ్రేషన్ సేవలు అందించే కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఈ గుర్తింపు లభించడంతో విమానాశ్రయం ప్రారంభమైన వెంటనే అంతర్జాతీయ విమాన సర్వీసులు నిర్వహించేందుకు అవసరమైన చట్టపరమైన అనుమతులు, ఇమిగ్రేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది.

భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ అనుసంధానం మరింత బలోపేతం కానుంది. పర్యాటక రంగం, వాణిజ్య రంగం, ఎగుమతులు, దిగుమతులు, పారిశ్రామిక పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా ఈ విమానాశ్రయం కీలక రవాణా కేంద్రంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. హోటళ్లు, రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడం ద్వారా ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

కేంద్ర హోంశాఖ తీసుకున్న తాజా నిర్ణయం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాధాన్యాన్ని మరింత పెంచిందని అధికారులు పేర్కొంటున్నారు. నిర్మాణం పూర్తికాకముందే ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్ హోదా లభించడం ప్రాజెక్టుకు విశేష గుర్తింపుగా భావిస్తున్నారు. దశలవారీగా అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి చేసి భోగాపురం విమానాశ్రయాన్ని దేశంలోని అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.