*పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి*
*అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి*
*మంత్రి కొండా సురేఖ*
హనుమకొండ మహా;
గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణతో పాటు వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం హనుమకొండలోని రోడ్లు & భవనాల (ఆర్అండ్బీ) అతిథి గృహంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్నలతో కలిసి హన్మకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, శాఖల మధ్య సమన్వయం, ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పన, శాంతిభద్రతలు, నేర నియంత్రణ, వుమెన్ సేఫ్టీ తదితర వివిధ అంశాల పై వారు చర్చించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, వేగవంతమైన, పారదర్శక పాలనను అందించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి వారికి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నగర పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ చర్యలు, జీడబ్ల్యూఎంసీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లోపభూయిష్టంగా ఉన్న విద్యుత్ దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ లో నిర్మిస్తున్న సమీకృత కూరగాయలు–మాంసాహార (ఇంటిగ్రేటెడ్ వెజ్–నాన్‌వెజ్) మార్కెట్ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
రాబోయే బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత తదితర అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో జీడబ్ల్యూఎంసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.








