హైదరాబాద్, మహా.
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షకు హాజరైన 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కేవలం 8,809 మంది మాత్రమే ఉత్తీర్ణులు కాగా, 14,814 మంది ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం 37.29 శాతానికి పరిమితమైంది.
గత నెలలో నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలు తాజాగా వెలువడగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గింది. గత ఏడాది ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత 50 శాతం ఉండగా, ఈసారి అది 37.29 శాతానికి పడిపోవడం చర్చనీయాంశమైంది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నాటికి టెట్ అర్హతను తప్పనిసరిగా సాధించాల్సి ఉంది. నిర్ణీత గడువులోపు టెట్లో ఉత్తీర్ణత సాధించని ఉపాధ్యాయులు ఉద్యోగ అర్హత కోల్పోయే అవకాశం ఉండటంతో, తాజా ఫలితాలు ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళనకు కారణమయ్యాయి.
టెట్లో విఫలమైన ఉపాధ్యాయులు రానున్న పరీక్షల్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందా? లేక ఇతర చర్యలు తీసుకుంటుందా? అనే అంశంపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.







