హైదరాబాద్, మహా.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన ఇంజనీర్ (సీఈ) బచ్చు రవీందర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, భారీ మొత్తంలో స్థిర, చర ఆస్తులను గుర్తించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో 15 ప్రత్యేక బృందాలు మైత్రివనంలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం, గచ్చిబౌలిలోని సుమధుర టవర్స్‌లో ఉన్న బచ్చు రవీందర్ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మరో పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి.
సోదాల సందర్భంగా బచ్చు రవీందర్ పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భారీ ఆస్తులను అధికారులు గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ.9.24 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు లభించగా, ప్రస్తుతం ఉన్న బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఇవి రూ.100 కోట్లకు పైగా ఉంటాయని ఏసీబీ అంచనా వేసింది.
సోదాల్లో కొండగల్, కిష్టాపూర్, పసుమల ప్రాంతాల్లో ఐదు ఓపెన్ ప్లాట్లు, నానక్‌రామ్‌గూడలో సుమారు రూ.2 కోట్ల విలువైన నాలుగు ఫ్లాట్లు, కొత్తూరులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలలో సుమారు రూ.1.33 కోట్ల విలువైన విల్లా, కొండపూర్ మసీదు బండ ప్రాంతంలో రూ.3 కోట్ల విలువ చేసే నాలుగు అంతస్తుల భవనం గుర్తించారు. అలాగే నివాసంలో రూ.3.82 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.45.05 లక్షల నగదు నిల్వలు, దాదాపు కిలోన్నర బంగారం, 12.5 కిలోల వెండి, రూ.17.24 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.9.32 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ.1.16 కోట్ల విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.
సోదాల సమయంలో లభించిన పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, పెట్టుబడులకు సరైన లెక్కలు చూపలేకపోవడంతో వాటిని అక్రమాస్తులుగా ప్రాథమికంగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనితో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి బచ్చు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తులపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది.







