భోజ్‌శాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.
* ఓపికతో వ్యవహరించాలని హిందూ, ముస్లిం పక్షాలకు సూచన.
ఢిల్లీ, మహా.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల–కమల్ మౌలా మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం అత్యంత సున్నితమైనదని పేర్కొంటూ హిందూ, ముస్లిం పక్షాలు సంయమనం, ఓపికతో వ్యవహరించాలని సూచించింది. అవసరమైతే రోజువారీ విచారణ నిర్వహించి ఈ వివాదానికి వీలైనంత త్వరగా చట్టబద్ధమైన పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
భోజ్‌శాల హిందూ ఆలయమని పేర్కొంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పలు అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఈ వివాదం అత్యంత సున్నితమైనదని, కోర్టులో ఉపయోగించే ప్రతి పదం కూడా ప్రజల్లో అపోహలు, ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. అందువల్ల అన్ని పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.
ప్రస్తుతం ఈ కేసులో తాత్కాలిక ఏర్పాట్ల అంశం మాత్రమే తమ ముందుకు వచ్చిందని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏర్పాట్లను, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న శాంతిభద్రతల చర్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అవసరమైతే 10 నుంచి 15 రోజుల్లోగా ఈ కేసును ప్రత్యేక ధర్మాసనం ముందు జాబితా చేసి రోజువారీ విచారణ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాన న్యాయమూర్తి మౌఖికంగా వెల్లడించారు. అన్ని పక్షాల వాదనలు పూర్తిగా విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
శుక్రవారం నమాజ్‌కు తాత్కాలిక ఏర్పాటుపై సూచన
విచారణ సందర్భంగా మధ్యంతర చర్యగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు నమాజ్ నిర్వహించేందుకు సముదాయం పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించే అవకాశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే తమ అనుమతి లేకుండా భోజ్‌శాల–కమల్ మౌలా సముదాయంలో ఎలాంటి నిర్మాణ మార్పులు చేపట్టవద్దని భారత పురావస్తు సర్వే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో ముస్లిం పక్షం తరఫున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ, న్యాయవాది నిజాం పాషా వాదనలు వినిపిస్తూ అత్యవసర విచారణ కోరారు. అయితే పిటిషన్లలో ఉన్న సాంకేతిక లోపాలను ముందుగా సరిచేయాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే విచారణకు జాబితా చేస్తామని హామీ ఇచ్చారు.
గత మే 15న మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్‌శాల–కమల్ మౌలా సముదాయం సరస్వతీ దేవికి అంకితమైన ఆలయమని పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. అదే సమయంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు గతంలో భారత పురావస్తు సర్వే సంస్థ జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
ఎన్‌ఐఏ చట్టంపై కేంద్రానికి నోటీసు
మరోవైపు, జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం–2008 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కొంత గడువు కోరగా, ధర్మాసనం నాలుగు వారాల సమయం మంజూరు చేసింది. అనంతరం పిటిషనర్‌కు రెండు వారాల గడువు ఇచ్చి, ఆరు వారాల తర్వాత తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.
2008లో ముంబయి ఉగ్రదాడుల అనంతరం అమల్లోకి వచ్చిన ఎన్‌ఐఏ చట్టం రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని, పోలీసు వ్యవస్థ రాష్ట్ర జాబితాలో ఉన్న నేపథ్యంలో కేంద్రం అధికార పరిధిని మించిందని పిటిషన్‌లో వాదించారు. ఈ అంశంపై కేంద్రం వివరణ ఇచ్చిన అనంతరం సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.






