- సిరిసిల్లలో రూ.105 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్దరణ పనులకు మంత్రి శంకుస్థాపన
- అమృత్ పథకం నిధులను దారి మళ్ళించడం దారుణం
- లేఖ రాస్తే నిధులు ఆగిపోతాయని హెచ్చరిక
సిరిసిల్ల, మహా : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్ధిక సంఘం నిధులను కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సర్పంచులను బెదిరించి, ఒత్తిడి తెస్తోందన్నారు. ‘‘అభివ్రుద్ధి పనులకు కేటాయించిన నిధులను కరెంట్ బిల్లులు, జీతాలకు ఎట్లా మళ్లిస్తారు? ఇది నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్ధిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తాం’’అని చెప్పారు. గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులు, సిబ్బంది జీత భత్యాలకు కూడా నిధులివ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం అమృత్ 2 స్కీం కింద రూ.105 కోట్ల నిధుల అంచనా వ్యయంతో చేపట్టిన కార్గిల్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. పక్కనే ఉన్న కార్గిల్ యుద్ద శకటాన్ని సందర్శించారు. కార్గిల్ యుద్దంలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు.
అమృత్ 2 స్కీం కింద రూ.1.32 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులు చేపట్టి ఈ చెరువును సుందరంగా తీర్చిదిద్దుతామని, మురుగునీరు రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. అమృత్ కింద కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తున్నా గడువులోగా పనులు చేయడం లేదని మంత్రి మండిపడ్డారు. దీనివల్ల నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదముందన్నారు. గొప్ప ఆశయంతో అమృత్ స్కీంను ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని, పట్టణాల్లో ప్రతి ఇంటికి నూటికి నూరు శాతం నల్లా కనెక్షన్ అందించడంతోపాటు మురుగునీటి (సీవరేజ్) సౌకర్యం కల్పించడం, పట్టణాలను వాటర్ సెక్యూర్ సిటీస్ గా తీర్చిదిద్దాలనే గొప్ప లక్ష్యంతో 2015లో అమృత్ పథకాన్ని ప్రారంభించారన్నారు. అమృత్ 1 మిషన్ కింద రూ.77 వేల 640 కోట్ల వ్యయం అంచనా వేస్తే కేంద్రం 35 వేల 990 కోట్లు కేటాయించింది. 2021 నాటికి అమృత్ 1 స్కీం పూర్తయ్యింది. ఆ తరువాత 2021 అక్టోబర్ లో అమృత్ 2 స్కీం పేరుతో 2 లక్షల 99 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తే, అందులో కేంద్రం తన వాటాగా 76 వేల 760 కోట్లు కేటాయించిందన్నారు.
అమృత్ 1 కింద 1660 కోట్లు, అమృత్ 2 కింద 3వేల 429 కోట్ల రూపాయలను తెలంగాణకు కేంద్రం కేటాయించగా, కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు అమృత్ పథకం కింద దాదాపు 400 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. అందులో సిరిసిల్ల మున్సిపాలిటీకి 105 కోట్ల 57 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నాంమని మంత్రి చెప్పారు. 12 ఏళ్లలో 13 లక్షల కోట్ల రూపాయలను తెలంగామ అభివృద్ధి కోసం ఖర్చు చేసిందని, అయినా కేంద్రం ఏమిచ్చింది? తెలంగాణకు అన్యాయం చేస్తుందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలాడుతున్నరన్నారు. అసలు తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ది జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా నయాపైసా కూడా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదన్నారు. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నయాపైసా ఇయ్యలేని, మోదీ ప్రభుత్వం వివిధ స్కీంల కింద నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. అమృత్ స్కీం కింద కేంద్రం నిధులిస్తుంటే వాటిని అభిమృద్ధి పనులకు కాకుండా కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాల కోసం ఖర్చు చేస్తూ నిధులను డైవర్ట్ చేస్తున్నారన్నారు. కేంద్రం ఏ ఉద్దేశంతో నిధులిస్తుందో… ఆ లక్ష్యానికే ఉపయోగించాలి. లేనిపక్షంలో ఆ నిధులను దారి మళ్లిస్తే మాత్రం ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వం తీరు మారకుండా కేంద్రానికి లేఖ రాస్తే నిధులు ఆగిపోయే ప్రమాదముందన్నారు. అదే సమయంలో కేంద్ర నిధులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, సిబ్బంది జీతభత్యాలు, కరెంట్ బిల్లులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైసలియ్యకపోతే ఎట్లా? కేంద్రం నిధులను దారి మళ్లించడం నిబంధనలకు పూర్తి విరుద్ధమన్నారు. సర్పంచులను బెదిరించి సిబ్బంది జీతాలకు కేంద్ర నిధులను ఎట్లా ఖర్చు చేస్తారు? ఇకనైనా తీరు మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు.








