- వరంగల్ గడ్డమీద నుండి శపథం చేస్తున్నా
- ఇగ కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనియ్య
- నీ కుట్రలు.. కుతంత్రాలు.. ఉపాయం ఉబలాటం అన్నీ తెలుసు
- ఒకరోజు ముందో..వెనుకో కుట్రదారులందరినీ ఊచలు లెక్కబెట్టిస్తా
- నిన్ను తొక్కుకుంటూ ఈ సీట్లోకి వచ్చిన.. అసెంబ్లీలో చర్చకు రా
- కేసీఆర్ కుటుంబ ఉద్యోగం పోయినందుకే 50వేల మందికి ఉద్యోగాలొచ్చినయి
- నాలుగేళ్ళు కడుపుకట్టుకుని.. మీ కోసం పనిచేస్తా
- తెలంగాణలో కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా
- వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తాం
- వరంగల్ ప్రజాప్రతినిధుల కృషి వల్లే రూ.6వేల కోట్లు నిధులు
- వరంగల్ అభివృద్ధి చేస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే.
- అందుకే నగరం అభివృద్ధి జరిగే వరకూ నిద్రపోను.
- తెలంగాణలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం
- 18వేల కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాం
- వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అనలేదా?. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అసెంబ్లీకి వచ్చి చెప్పాలి
- ఆయన రాకుండా ఇద్దరు చిల్లరగాళ్ళను ఆంబోతుల్లా ఊరిమీదకు వదిలిండు
- సోనియమ్మ కాళ్ళు కడిగి.. నీళ్ళు నెత్తిన పోసుకుంటాం
- కిషన్ రెడ్డీ.. నువ్వు మోడీ గులాం… నీకు తెలంగాణలో ఉండే అర్హత లేదు
- కేసీఆర్ ఫుల్ కు.. హాఫ్ కు బ్రాండ్ అంబాసిడర్
- వరంగల్ వేదికగా నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వరంగల్ , మహా :
కేసీఆర్ దమ్ముంటే కాస్కో. ఈ వరంగల్ గడ్డమీద నుండి చెబుతున్న. కేసీఆర్ అనే మొక్కను ఇగ తెలంగాణలో మొలకెత్తనియ్య. ఇక్కడి నుండే పోరాటం మొదలుపెట్టిన . నిన్ను ఓడిస్తా అన్న ఓడించిన. నీకు పార్లమెంట్ లో గుండుసున్నా తెప్పిస్తా అన్న ..తెప్పించిన. చూద్దాం మా కార్యకర్తల పౌరుషమో. నీ కుట్రలు.. కుతంత్రాలో అంటూ ఓరుగల్లు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం- ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తే జైల్లో పెడతాం. తెలంగాణలో కేసీఆర్ తాగుబోతుల సంఘాన్ని తయారు చేశారు. ఫుల్, ఆఫ్‌కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. ప్రజలను మత్తుకు బానిసలుగా చేసి అధికారం చెలాయించారు. బీఆర్ఎస్ అధికారం దిగిపోతే కేసీఆర్, కుటుంబ సభ్యుల ఉద్యోగాల ఊడాయి తప్ప.. రాష్ట్రానికి ఏం కాలేదు. కేసీఆర్.. హాయిగా మీరు ఫామ్ హౌస్‌లో పడుకోండి. అవసరమైతే అక్కడే వైన్ షాప్ ఏర్పాటు చేయిస్తా. మీ ఉద్యోగాలు పోయాయి కాబట్టి రైతులకు రుణమాఫీ జరుగుతోంది. ఇంకా కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. కచ్చితంగా చేసి తీరుతాం. అభివృద్ధిపై చర్చకు బిల్లా-రంగాలు సిద్ధమా..? రైతు రుణమాఫీ చేస్తే అభినందించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అనలేదా?. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ పెట్టిస్తా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. ఆయన రాకుండా ఇద్దరు చిల్లరగాళ్లను పంపుతున్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా వారు ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. నా ఆఖరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసం పనిచేస్తా. తెలంగాణలో కేసీఆర్ మొక్కను మళ్లీ మొలవనివ్వను. దమ్ముంటే అసెంబ్లీకి రా.. చర్చిద్దాం అని సవాల్ విసిరారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు. మీరు భుజాల మీద మోయబట్టే మేమంతా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఉంది. 2014 నుంచి 2019 వరకూ బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రిగా లేరని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మహిళలు ఇచ్చిన తీర్పుతో మెుదటి మంత్రివర్గంలోనే కొండా సురేఖ, సీతక్కకు మంత్రులుగా అవకాశం కల్పించామని సీఎం చెప్పుకొచ్చారు. ఈ ఓరుగల్లు ఆడబిడ్డలకే మంత్రివర్గంలో ప్రముఖస్థానం ఇచ్చి నేటి సభా నిర్వహణ కార్యక్రమాన్ని సైతం వారి చేతుల్లోనే పెట్టామని రేవంత్ తెలిపారు. ఇదే కాకుండా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కడియం కావ్యను పార్లమెంట్‌కు పంపించామని ఆయన చెప్పారు. ఆమె తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతోందని అన్నారు. పాలకుర్తిలో ఓ రాక్షసుడు రాజ్యమేలుతుంటే యశస్విని రెడ్డి అనే సోదరి ఆ రాక్షసుడిని ఎన్నికల్లో ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా ఆడబిడ్డనే అని ఆయన తెలిపారు. అనేక మంది మహిళా అధికారులు పలు జిల్లాలకు కలెక్టర్లుగా ఉన్నారని వెల్లడించారు. వరంగల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా ఓ మహిళలే ఉందని సీఎం చెప్పుకొచ్చారు. వారి రుణం ఇంకా తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి చెప్పారు.
కిషన్ రెడ్డీ.. కాళ్ళల్లో కట్టెపెట్టొద్దు
హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని.. అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. అదే గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ చేస్తే పొగడ్తలు కురిపిస్తున్నారని.. మోదీకి గులాంగిరీ చేయటానికి సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి అంటే నిన్నా మొన్నటి వరకు గౌరవం ఉండేదని.. ఇప్పుడు మర్యాద తీసుకోవటం కోల్పోయాడు అంటూ చురకలు అంటించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే సోనియాగాంధీ దయ వల్ల అని.. ఇవాళ స్వేచ్ఛగా సభ పెట్టుకున్నాం అంటే అది సోనియా వల్లే అన్నారు రేవంత్ రెడ్డి. అలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచిన మోదీకి గులాంగిరీ చేయటానికి మనస్సు ఎలా వచ్చిందంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నించారాయన. తెలంగాణ ద్రోహి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అలాంటి మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాంగిరీ చేస్తారంట. ఆయనకు తెలంగాణలో ఉండే అర్హత లేదు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందుకే ఆమె కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా తప్పులేదు. కాళోజీ కళాక్షేత్రం పదేళ్లైనా మీరెందుకు పూర్తిచేయలేదు. తెలంగాణ భావాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. అందుకే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశాం. మీరు అభివృద్ధి చేసేవాళ్ల కాళ్లలో కట్టె పెట్టొద్దు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు.
వరంగల్ ను తీర్చిదిద్దుతాం
వరంగల్‌ను హైదరాబాద్‌కు పోటీ నగరంగా తీర్చుదిద్దుతున్నాం. అందుకే వరంగల్‌కు రూ.5,500 కోట్ల నిధులు మంజూరు చేశాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఖమ్మం కంటే వరంగల్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. వరంగల్ అభివృద్ధి చేస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే. అందుకే నగరం అభివృద్ధి జరిగే వరకూ నిద్రపోను. వరంగల్, కొత్తగూడెం, రామగుండంకు ఎయిర్‌పోర్ట్‌లు రావాల్సి ఉంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నాం” అని చెప్పారు.
తండ్రీ కొడుకుల ఉద్యోగాలు పోతే..
తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితే రాష్ట్రంలోని 50వేలకు పైగా నిరుద్యోగులకు పదిమాసాల్లో ఉద్యోగాలు వచ్చాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ పదేండ్లలో చేయని అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులకు ఇప్పటికీ రూ.2 లక్షల రుణమాఫీ కాలేదు. ఈ క్రమంలోనే మిగిలిన రైతులకు త్వరలోనే రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు