Mahaa Daily Exclusive

  చంద్రమండలం పోయినా సరే.. కేటీఆర్ కుట్రకు ఊచలు లెక్కించాల్సిందే..

Share

  • ఎంత దూరం ఉరుకుతవో.. ఉరుకు
  • వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీకి రా సామి.. ఒక్కసారి రా కేసీఆర్
  •  80 వేల పుస్తకాల్లో ఏం చదివావో చర్చ చేద్దాం
  • కరీంనగర్ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
  • రంగనాయకసాగర్ సేకరణ భూముల్లో హరీష్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు
  • కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులను మేం పది నెలల్లో చేసి చూపించాం

 

వేములవాడ, మహా

మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలి… 80 వేల పుస్తకాల్లో ఏం చదివారో చెప్పాలి.. అసెంబ్లీకి రా సామీ.. ఒక్కసారి రా. చర్చచేద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు. కేసీఆర్ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నా. కేటీఆర్ ఢిల్లీ కాదు చంద్ర మండలం పోయి ఫిర్యాదు చేసుకున్నా సరే చేసిన కుట్రకు నువ్వు ఊచలు లెక్కబెట్టాల్సిందే అంటూ బుధవారం వేములవాడలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. త్వరలోనే మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మంత్రి ఉత్తమ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈనెల 30న మరోసారి ఉత్తమ్కుమార్రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు.

” ఇందిరమ్మ రాజ్యంలో వేములవాడను అభివృద్ధి చేసుకుంటున్నాం. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని ఆనాడే మాట ఇచ్చాం. త్వరలోనే పరిష్కరిస్తాం. కలికోట సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పూర్తవుతాయని ఆనాడే చెప్పా. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నవంబర్ 30లోగా జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేస్తారు. దేశానికి దశ-దిశ సూచించిన నేత పీవీ పుట్టిన గడ్డ కరీంనగర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఈ కరీంనగర్ గడ్డపై నుంచే సోనియమ్మ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎంత త్యాగానికైనా సిద్దమవుతుందని సోనియమ్మ నిరూపించారు. కరీంనగర్‌లో బీజేపీని గెలిపిస్తే జిల్లాకు ఏం ఒరిగింది? కరీంనగర్ అభివృద్ధి కోసం బండి సంజయ్‌ పార్లమెంట్‌లో ఎప్పుడైనా ప్రశ్నించారా? జిల్లా అభివృద్ధికి చిల్లి గవ్వ తెచ్చారా ?. అలా చేసి ఉంటే జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలేవా? అని సీఎం ప్రశ్నించారు.

 

మీ నొప్పికి మందు మా కార్యకర్తలకు తెలుసు

 

పదేళ్లలో రూ.20లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. రూ.100 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి ఎందుకు చేయలేదు ?. ప్యాకేజీ 9 ఎందుకు పూర్తి చేయలేదు?. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రమాదవశాత్తు మరణించిన గల్ఫ్ కార్మికులకు రూ.5లక్షల ప్రమాదబీమా అందిస్తున్నాం. కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులను మేం పది నెలల్లో చేసి చూపించాం. ఏలేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్లు.. వాళ్లను ఓడించినా వాళ్ల తీరు మారలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా వచ్చింది.. ఇప్పుడు వాళ్ల వేషాలు చూస్తుంటే వాళ్ల మెదడు కూడా పోయినట్టుంది. పదేళ్లు ఏం వెలగబెట్టారని.. పదినెలల్లో మనల్ని దిగి పొమ్మంటున్నారు ?. మీ నొప్పికి మా కార్యకర్తలకు మందు ఎక్కడ పెట్టాలో తెలుసు. రుణమాఫీపై దుష్ప్రచారం చేసున్న మీకు.. ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే సత్తా ఉంటే అసెంబ్లీకి రా. మా వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెబుతారు.

 

లెక్క కట్టి చూపిస్తా

 

పది నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇచ్చాం. లెక్క కట్టి చూపిస్తా. ఒక్క తల తగ్గినా నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. మీ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో.. మా పదినెలల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చర్చకు పెడదాం రా. ఆనాడు వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్‌ది. కానీ ఇప్పుడు 66 లక్షల 1కోటి 53లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఆయన కట్టిన కాళేశ్వరం కుంగిపోయినా.. ఒక్క చుక్క కాళేశ్వరం నీళ్లు లేకుండా 1కోటి 53లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. పదేళ్లలో కేసీఆర్ ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 23 వేల కోట్లు ఖర్చు చేశారు. ఏ ప్రాజెక్టునైనా పూర్తిచేశారా? ప్రజలకు నీళ్లు ఇచ్చామని చెప్పగలరా?. రంగనాయక్ సాగర్ కోసం సేకరించిన భూముల్లో హరీశ్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అన్నీ లెక్కలు తీస్తాం.. అన్నీ బయటకు తీస్తాం. కొండపోచమ్మ సాగర్ కట్టింది కేసీఆర్ ఫామ్ హౌస్‌కు నీళ్లు తీసుకెళ్లేందుకే

 

బామ్మర్ది డ్రగ్స్ తీసుకున్నా పట్టుకోవద్దట

 

బావ కళ్లల్లో ఆనందం చూడటానికి బామ్మర్ది డ్రగ్స్ తీసుకున్నా పట్టుకోవద్దట. పేదలకు ఒక చట్టం నీకో చట్టమా?. ముఖ్యమంత్రిగా నా నియోజకవర్గ ప్రజలకు నీళ్లు ఇచ్చేందుకు నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేద్దామంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు. పరిశ్రమలు తెస్తే మా ప్రాంతానికి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటూ భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు..

 

కొడంగల్ అంటే ఎందుకింత కక్ష

 

కొంత మంది రౌడీ మూకలను తయారు చేసి అధికారులపై దాడి చేశారు. పైగా కేసులు పెట్టారని అంటున్నారు. నీ కొడుకు, నీ అల్లుడు భాషను మీరు సమర్థిస్తారా కేసీఆర్. తెలంగాణలో పరిశ్రమలు పెట్టొద్దా.. మా పిల్లలకు ఉద్యోగాలు రావొద్దా?. పదేళ్లు పాలించిన మీరు భూసేకరణ చేయలేదా ?. కొండమ్మ పోచమ్మ సాగర్‌లో భూములు గుంజుకున్న చరిత్ర మీది. కొడంగల్‌లో భూసేకరణ చేస్తే మీకు కడుపుమంట దేనికి ?. కొడంగల్ అంటే మీకు ఎందుకు ఇంత కక్ష. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూములు కోల్పోయి బాధలో ఉన్నవారిని మా ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుంది. పరిహారం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ ఢిల్లీ కాదు చంద్ర మండలం పోయి ఫిర్యాదు చేసుకున్నా సరే చేసిన కుట్రకు నువ్వు ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఉరుకు ఎంతదూరమో ఉరుకుతవో చూస్తున్నా. చివరగా కేసీఆర్‌కు ఒక్క మాట చెబుతున్నా.. అసెంబ్లీకి రా సామి.. ఒక్కసారి రా” అని సీఎం రేవంత్ అన్నారు. కార్యక్రమంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రంధాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేష్ పాల్గొన్నారు.