కారేపల్లి, మహా: సింగరేణి మండలం గాదెపాడుకు ఖమ్మం నుండి గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ అదనపు బస్ ట్రిప్ ప్రారంభమైంది. దీంతో ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరినట్టయింది. దీంతో ప్రయాణికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఖమ్మం నుండి గాదెపాడు (వయా ఉట్కూరు ఎర్రబోడు)కు ఇప్పటివరకు ఉదయం ,రాత్రి మాత్రమే బస్సు సౌకర్యం ఉండేది. అయితే ఉదయం బస్సు కు ఖమ్మం వెళ్ళినవారు తమ పనులు ముగించుకొని రావాలంటే రాత్రి బస్సే శరణ్యం అయ్యేది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ ఆర్టీసీ జిల్లా ఉన్నతాధికారులకు గాదెపాడుకు బస్సును మరో ట్రిప్పు నడిపించాలని ఇటీవల ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. గాదెపాడుకు చెందిన సామాజిక కార్యకర్త వేముల రామమూర్తి సైతం బస్సు కోసం తన వంతు కృషి చేశారు. అందరి విన్నపాలు, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మం డిపో మేనేజర్ గురువారం నుండి గాదెపాడుకు మధ్యాహ్నం అదనపు ట్రిప్పును ప్రారంభించారు. ఈ బస్సు మధ్యాహ్నం ఒంటిగంటకు ఖమ్మం నుండి బయలుదేరి, రెండున్నర గంటలకు గాదెపాడు చేరుకుంటుందని, తిరిగి గాదెపాడు నుండి బయలుదేరి నాలుగు గంటలకు ఖమ్మం చేరుకుంటుందని డి ఎం తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం, మధ్యాహ్నం మరో బస్సు ట్రిప్పు కోసం విశేషంగా కృషి చేశామని, ఈ ప్రాంత ప్రయాణికులు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.







