Mahaa Daily Exclusive

  క్యూనెట్ పిరమిడ్ మోసంపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం…..

Share

క్యూనెట్ పిరమిడ్ మోసంపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.
* గోవాలో ఐదుగురు అరెస్ట్.. లగ్జరీ కార్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం.

హైదరాబాద్, మహా.
కోట్ల రూపాయల క్యూనెట్ పిరమిడ్ మోసం కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సీసీఎస్–ఈఓడబ్ల్యూ టీమ్-1 అధికారులు గోవాలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. గోవాలోని నోవోటెల్ రిసార్ట్‌లో నిర్వహించిన ‘ఓషన్ 25వ వార్షికోత్సవ’ కార్యక్రమంలో ఈ దాడులు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

అరెస్టైన వారంతా కేరళకు చెందిన క్యూనెట్ ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్‌లుగా పోలీసులు గుర్తించారు. దాడుల సమయంలో మరో ముగ్గురు నిందితులు తప్పించుకోగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

నిందితుల నుంచి టయోటా ఫార్చ్యూనర్, కియా, ఎంజీ హెక్టర్‌కు చెందిన మూడు లగ్జరీ కార్లతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, కీలక డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ చాట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను విశ్లేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆధారాల ద్వారా మరిన్ని బాధితులు, నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రాథమిక విచారణలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితులను సంప్రదించి ఆకర్షించినట్లు పోలీసులు గుర్తించారు. అధిక లాభాలు వచ్చే వ్యాపార అవకాశమని నమ్మించి రూ.7.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టేలా ఒత్తిడి చేసినట్లు వెల్లడించారు. అలాగే గోవాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.30 వేల డిపాజిట్ కూడా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

కొత్త సభ్యులను చేర్చితే భారీ ఆదాయం వస్తుందని ప్రచారం చేస్తూ పిరమిడ్, మనీ సర్క్యులేషన్ విధానంలో ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జూమ్ సమావేశాలు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ అమాయకులను వలలోకి దింపినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువత, విద్యార్థులు, గృహిణులనే లక్ష్యంగా చేసుకుని ఈ మోసపూరిత వ్యవస్థను నడిపినట్లు గుర్తించారు.

తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని చెప్పే పిరమిడ్ స్కీమ్‌లు, మనీ సర్క్యులేషన్ పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. ఇలాంటి పథకాల పేరుతో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మోసపూరిత పథకాలను నిర్వహించే వారితో పాటు వాటిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.