Mahaa Daily Exclusive

  గ్లోబరీనా ఆరోపణలు నిరూపించాలి….లేకుంటే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

Share

వరంగల్, మహా.
గ్లోబరీనా సంస్థ తన బినామీ కంపెనీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ముఖ్యమంత్రికి పరువు నష్టం నోటీసులు పంపినట్లు తెలిపారు. గురువారం వరంగల్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదని కేటీఆర్ విమర్శించారు. లోక్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించడం రాజకీయ నాటకమేనని ఆరోపించారు.

గ్లోబరీనా నిజంగానే తన బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని, ఇప్పుడు అది తన బినామీ సంస్థ అని ఆరోపించడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

తాను సీఐడీ విచారణకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసిన కేటీఆర్, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సిట్ లేదా సీఐడీ విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా ముఖ్యమంత్రి భయపడుతున్నారని ఆరోపించారు.

పాత కేసుల భయం, అమృత్ పథకం సహా ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. గ్లోబరీనా సంస్థపై తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందు ఉంచాలని, లేకుంటే ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.