Mahaa Daily Exclusive

  నీట్ లీక్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన…

Share

నీట్ లీక్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన.
* లోక్‌సభ నేటికి వాయిదా.
* మంత్రి రాజీనామాపై ప్రతిపక్షాల పట్టుదల.
* షరతులతో చర్చలు కుదరవని కేంద్రం స్పష్టం.
ఢిల్లీ, మహా.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల్లో గురువారం తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది. నిరసనల మధ్య లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేయగా, రాజ్యసభను మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా వేశారు.
లోక్‌సభ సమావేశం ప్రారంభమైన వెంటనే నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం పేపర్ లీక్ జరిగిన విషయాన్ని అంగీకరించిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవిలో కొనసాగుతూ ఈ అంశంపై చర్చించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, రూల్ 267 కింద నీట్ వ్యవహారంపై తక్షణ చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదని విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే తాము ఏ చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రతిపక్షాల వైఖరిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. చర్చకు ముందే షరతులు విధించడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ వాదనను వినిపించే హక్కు కూడా కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు.