సుప్రీంకోర్టులో నిర్మాత బండ్ల గణేష్‌కు ఎదురుదెబ్బ.
• జూబ్లీహిల్స్ ఆస్తి వేలంపై పిటిషన్ కొట్టివేత.
• హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.
హైదరాబాద్, మహా.
సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్‌లోని తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ చేపట్టిన వేలం ప్రక్రియను సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్ తీసుకున్న రుణాలకు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు హామీదారులుగా ఉన్న నేపథ్యంలో, సర్ఫేసీ చట్టం కింద యూనియన్ బ్యాంక్ 2019లో జూబ్లీహిల్స్‌లోని ఆస్తిని స్వాధీనం చేసుకుంది. అనంతరం 2022లో నిర్వహించిన ఈ-వేలంలో ఆ ఆస్తి రూ.8.51 కోట్లకు విక్రయించబడింది.
ఈ వ్యవహారంలో తొలుత రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) వేలం ప్రక్రియను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. బ్యాంక్ వాదనలను సమర్థించిన హైకోర్టు డీఆర్‌టీ నిర్ణయాన్ని రద్దు చేస్తూ వేలం ప్రక్రియ చట్టబద్ధమేనని తీర్పు ఇచ్చింది.
ఎన్సీఎల్టీలో దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నందున వేలం చెల్లదని బండ్ల గణేష్ తరఫున వాదనలు వినిపించగా, వేలం వేసిన ఆస్తి కంపెనీది కాకుండా రుణాలకు హామీగా ఉన్న వ్యక్తిగత ఆస్తి కావడంతో సర్ఫేసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంలో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని యూనియన్ బ్యాంక్ వాదించింది. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో జూబ్లీహిల్స్ ఆస్తి వేలం ప్రక్రియకు అత్యున్నత న్యాయస్థానంలోనూ చట్టబద్ధత లభించినట్లైంది.








