Mahaa Daily Exclusive

  రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు.

Share

హైదరాబాద్, మహా.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం (జూలై 24) తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం ప్రారంభించాయి.

ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వాహకులు బంద్‌కు సహకరించాలని కోరాయి. దేశ విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.

బంద్ పిలుపు నేపథ్యంలో పలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ముందస్తుగా సెలవులు ప్రకటిస్తున్నాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు మొబైల్ సందేశాల ద్వారా తెలియజేస్తున్నాయి. బంద్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా శుక్రవారం మూతపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

దిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తెలంగాణ విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని, దిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై పారదర్శక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. అలాగే విద్యా కేంద్రీకరణకు దారితీస్తోందని ఆరోపిస్తూ వీబీఎస్ఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

రాహుల్ గాంధీపై జరిగిన నిర్బంధ చర్యలు, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, వారి న్యాయమైన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలు, పలు సామాజిక సంస్థలు పెద్దఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.