Mahaa Daily Exclusive

  సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ….

Share

సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.
• హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు.
• మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశం.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. షిల్లాంగ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం రద్దు చేసింది. మూడు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సోనమ్ రఘువంశీని జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరలే ధర్మాసనం ఆదేశించింది. మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ హత్య కేసులో షిల్లాంగ్ హైకోర్టు సోనమ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న ధర్మాసనం, హత్య వంటి తీవ్రమైన నేరంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బెయిల్ కొనసాగించడం సమంజసం కాదని పేర్కొంది. అయితే కేసు విచారణ ఆరు నెలల్లోగా పూర్తికాకపోతే సోనమ్ మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది.

ఇంతకుముందు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు సోనమ్‌కు రెండు మార్గాలను సూచించింది. స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోవడం లేదా బెయిల్ రద్దుకు సిద్ధపడాలని తెలిపింది. కేసులో కీలక సాక్షుల వాంగ్మూలాలు నమోదయ్యేలోపు లొంగిపోవాలని సూచించిన న్యాయస్థానం, ఆమె లొంగిపోతే సాక్షుల విచారణను వేగవంతం చేసి, అనంతరం బెయిల్ అంశాన్ని చట్ట ప్రకారం పునఃపరిశీలించాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇవ్వవచ్చని పేర్కొంది. నిర్ణీత గడువులో నిర్ణయం తీసుకోకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది.

ఈ కేసు గత ఏడాది మేలో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌కు చెందిన రాజా రఘువంశీ మే 11న సోనమ్‌ను వివాహం చేసుకున్నాడు. అనంతరం మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ దంపతులు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, 11 రోజుల తర్వాత సోహ్రా సమీపంలోని లోయలో రాజా మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో హత్యగా కేసు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా జూన్ 7న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపూర్‌లో సోనమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సోనమ్, రాజ్ కుశ్వాహాతో పాటు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అనంతరం ఏప్రిల్‌లో షిల్లాంగ్ హైకోర్టు సోనమ్‌కు బెయిల్ మంజూరు చేసింది.

ఇదిలా ఉండగా, సోనమ్ అరెస్టు సమయంలో పోలీసులు చేసిన సాంకేతిక తప్పిదాల కారణంగానే ఆమెకు బెయిల్ లభించిందన్న అంశం కూడా ఈ కేసులో ప్రాధాన్యం సంతరించుకుంది. అరెస్టు మెమోతో పాటు కేసు పత్రాల్లో సంబంధిత చట్టపరమైన సెక్షన్ల నమోదులో లోపాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఇది కేవలం సాంకేతిక పొరపాటేనన్న పోలీసుల వాదనను షిల్లాంగ్ హైకోర్టు అంగీకరించలేదు. అరెస్టుకు సంబంధించిన ప్రక్రియలో తగిన చట్టపరమైన కారణాలు నమోదు కాలేదని పేర్కొంటూ సోనమ్‌కు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు బెయిల్‌ను రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది.