సింగరేణి ఉత్పత్తి వ్యయం తగ్గించాలి.
• తెలంగాణ గుండెచప్పుడు సింగరేణి.
• భావితరాలకు లాభదాయకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
• ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
ఖమ్మం, మహా.
సింగరేణి కాలరీస్ కంపెనీ తెలంగాణకు గుండెచప్పుడు లాంటిదని, 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రభుత్వ రంగ సంస్థను భావితరాలకు మరింత బలోపేతంగా, లాభదాయకంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. పోటీ ప్రపంచంలో ప్రైవేటు సంస్థలకు దీటుగా నిలిచేలా సింగరేణి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. గురువారం సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మైనింగ్ నిర్వహణలో పాటిస్తున్న విధానాలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఈ పర్యటన చేపట్టినట్లు భట్టి తెలిపారు. బొగ్గే సింగరేణికి ప్రధాన ఆదాయ వనరని, ఓవర్‌బర్డెన్ మట్టి, రాళ్లు బొగ్గులో కలవకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతి షావల్, ప్రతి లోడింగ్ పాయింట్ వద్ద అధికారులు నిరంతర నిఘా ఉంచాలని, నాణ్యత లేని బొగ్గు రవాణా వల్ల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు. జెన్‌కోతో పాటు ఇతర వినియోగదారులకు నాణ్యమైన బొగ్గునే సరఫరా చేయాలని సూచించారు.
ఒకప్పుడు బొగ్గు రంగంలో ఏకఛత్రాధిపత్యం ఉండేదని, ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు, దిగుమతి బొగ్గుతో తీవ్ర పోటీ నెలకొందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ నాణ్యతతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించగలిగితేనే సింగరేణి మార్కెట్‌లో నిలదొక్కుకోగలదన్నారు. గత పదేళ్లలో కొత్త కోల్ బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనకపోవడం వల్ల విలువైన అవకాశాలు కోల్పోయిందని పేర్కొన్నారు.
ఒక కోల్ బ్లాక్‌ను పొందిన తర్వాత భూసేకరణ, అటవీ అనుమతులు పూర్తిచేసి మైనింగ్ ప్రారంభించేందుకు ఏడు నుంచి ఎనిమిదేళ్లు పడుతుందని, అందువల్ల కనీసం పదేళ్ల ముందుచూపుతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే దశాబ్దంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి, జెన్‌కో సంయుక్తంగా బొగ్గు అవసరాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిచర్ల-2, నైని కోల్ బ్లాకులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించామని, భవిష్యత్తులో కొత్త కోల్ బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్ విద్యుత్ రంగంలో వేగంగా విస్తరించాలని భట్టి సూచించారు. భవిష్యత్తులో సోలార్, పంప్డ్ స్టోరేజ్, హైడ్రోజన్, అణుశక్తి వినియోగం పెరుగుతుందని పేర్కొంటూ, ఆ దిశగా సంస్థ ముందస్తు ప్రణాళికతో సాగాలని అన్నారు. అలాగే సెమీకండక్టర్లు, చిప్ తయారీకి అవసరమైన క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణలో కూడా సింగరేణి ప్రవేశించాలని సూచించారు. అధికారులు, ఇంజనీర్లు, కార్మికులు సమన్వయంతో పనిచేస్తే సింగరేణిని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
అనంతరం కిష్టారంలో నిర్మించిన సింగరేణి ఉద్యోగుల నూతన క్వార్టర్లను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, జెన్‌కో సీఎండీ హరీష్, సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పోట్రూ, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సింగరేణి డైరెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








