నీట్ ఉద్యమానికి అండగా ఇండియా కూటమి.
* ఢిల్లీలో ఉద్రిక్తత.
* రాహుల్ గాంధీ నివాసం నుంచి రాజ్‌ఘాట్‌కు ర్యాలీకి యత్నం.
* ఎంపీల బస్సును అడ్డుకున్న పోలీసులు
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ, విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఇండియా కూటమి రంగంలోకి దిగింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో గురువారం అత్యవసరంగా సమావేశమైన ఇండియా కూటమి ఎంపీలు, నీట్ పేపర్ లీకేజీ, సీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు, తదుపరి కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు పలు విపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కూటమి నేతలు, నీట్ పేపర్ లీకేజీతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు నివాళులర్పించేందుకు రాజ్‌ఘాట్‌లోని గాంధీ స్మృతిని సందర్శించాలని నిర్ణయించారు.
సమావేశం అనంతరం రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష ఎంపీలు, నేతలంతా ఒకే బస్సులో రాజ్‌ఘాట్‌కు ర్యాలీగా బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బస్సును అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ మధ్యలోనే వాహనాన్ని వదిలి వెళ్లిపోవడం మరింత కలకలం రేపింది. పోలీసులు తమను ఇండియా గేట్‌కు వెళ్లనివ్వలేదని, ఇప్పుడు రాజ్‌ఘాట్‌కు వెళ్లడానికీ అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం ప్రతిపక్ష ఎంపీలంతా అవసరమైతే రోడ్లపైకి వచ్చి పోరాడతామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించడమే కాకుండా, ఆందోళనల సందర్భంగా లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించేందుకే రాజ్‌ఘాట్‌కు వెళ్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఎప్పటికీ ఒంటరివారు కాదని, వారి న్యాయమైన డిమాండ్లకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా కూడా వెల్లడిస్తూ, విద్యార్థుల గొంతుకు అండగా నిలబడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
మరోవైపు జంతర్‌మంతర్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సాయంత్రం 6.30 గంటల నుంచే హోటళ్లు, దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరసనకారులు జంతర్‌మంతర్‌కు చేరుకోవడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. పోలీసుల వైఖరిపై సీజేపీ నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదిలా ఉండగా, అమిత్ షా నివాసాన్ని కూడా ముట్టడించేందుకు ఇండియా కూటమి ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద నిర్వహించిన మెరుపు ధర్నా తరహాలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి ఎదుట కూడా నిరసన చేపట్టే అవకాశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి, బారికేడ్లు ఏర్పాటు చేశారు.
పోలీసుల మోహరింపుపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. పోలీసులను చూపించి తమను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని, కానీ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం ఆపబోమని అన్నారు. తాము దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు కలిగిన ప్రజాప్రతినిధులమని స్పష్టం చేశారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలు, విపక్షాల నిరసనలతో జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత రోజురోజుకూ పెరుగుతోంది. విద్యార్థుల ఉద్యమానికి పూర్తి మద్దతుగా ఇండియా కూటమి రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.







