Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ టవర్స్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం…

Share

ఇందిరమ్మ టవర్స్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం.
* పేదల జీవితాలతో రాజకీయాలు చేయొద్దు.
* రూ.40–60 లక్షల ఫ్లాట్‌కు లబ్ధిదారుడి వాటా రూ.6 లక్షలే.
* మిగతా సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం.

హైదరాబాద్, మహా.
ఇందిరమ్మ టవర్స్ పథకంపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం పూర్తిగా దుష్ప్రచారమేనని, పేదల జీవితాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను విక్రయిస్తున్నారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. పేదలకు శాశ్వత గృహాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. గురువారం తెలంగాణ సచివాలయంలో గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు.

పేదలకు ఇళ్లు నిర్మించి అందిస్తుంటే బీఆర్ఎస్‌కు ఎందుకంత అభ్యంతరమని మంత్రి ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే చేసి చూపిస్తోందని అన్నారు. పేద కుటుంబాలకు నాణ్యమైన గృహాలు అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ టవర్స్‌ను పారదర్శకంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

మార్కెట్‌లో రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు విలువ చేసే ఫ్లాట్‌ను లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షల వాటాతోనే పొందే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. పేదలకు భారంగా కాకుండా, అందుబాటు ధరలో సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

ఇళ్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్న మంత్రి, మొత్తం కేటాయింపుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. వాటిలో మహిళలకు 30 శాతం, ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఇందిరమ్మ టవర్స్ కోసం దరఖాస్తులు పూర్తిగా పారదర్శకంగా స్వీకరిస్తున్నామని, ప్రజలు మీ సేవ కేంద్రాలు, వాట్సాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096ను సంప్రదించాలని సూచించారు. పేదలకు గృహ హక్కు కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.