విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి.
* మోదీ మార్గదర్శకత్వంలో పనిచేస్తా: కేంద్ర మంత్రి.
ఢిల్లీ, మహా.
కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం అధికారికంగా స్వీకరించారు. నీట్ పేపర్ లీకుల వ్యవహారంపై దేశవ్యాప్తంగా నెలకొన్న వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన శాఖను అదనపు బాధ్యతగా ప్రహ్లాద్ జోషికి అప్పగించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి శనివారం జారీ చేయగా, ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ విద్యారంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో విద్యారంగంలో సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సేవలను ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి కొనియాడారు. ఆయన హయాంలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమల్లోకి రావడం దేశ విద్యారంగంలో కీలక సంస్కరణగా నిలిచిందన్నారు. విద్యా వ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఆయన విశేష కృషి చేశారని ప్రశంసించారు.
ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖతో పాటు పునరుత్పాదక ఇంధన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషికి కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖను కూడా అదనపు బాధ్యతగా కేటాయించింది. మూడు కీలక శాఖల నిర్వహణ బాధ్యతలు ఆయనపై ఉండటంతో విద్యారంగంలో తీసుకునే నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
నీట్ పేపర్ లీకుల ఘటన అనంతరం పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత, సాంకేతిక సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కొత్త విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.






