Mahaa Daily Exclusive

  బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం

Share

  • తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు
  • వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, మహా : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని కూడా పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నారాయణపేటలో కూడా వానలు పడనున్నాయి. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనూ వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లలో సోమవారం ఉదయం నుంచి అడపాదడపా వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. అనవసరంగా బయటకు రావడం మానుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం అయ్యారు. డ్రైనేజీ వ్యవస్థలలో నీరు నిలవడాన్ని తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆదివారం తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో అత్యధికంగా 7.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో 1.6 నుంచి 2.7 సెం.మీ మధ్య వర్షపాతం నమోదు కాగా, హయత్‌నగర్‌లో అత్యధికంగా 2.7 సెం.మీ, పెద్ద అంబర్‌పేటలో 1.8 సెం.మీ, బండ్లగూడ, పసుమాములలో 1.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆకాశం మేఘావృతమై, తడి వాతావరణం కారణంగా హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఐఎమ్‌డీ హైదరాబాద్ ప్రకారం సోమవారం పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది గణనీయమైన తగ్గుదలగా ఉంది.