Mahaa Daily Exclusive

  “త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ..కమలా కమలదళ విహారిణీ”… అజరామర శక్తి భారత్!

Share

“త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ..కమలా కమలదళ విహారిణీ”… అజరామర శక్తి భారత్!

(శివకుమార్ గనివాడ, సీనియర్ సామాజిక విశ్లేషకులు)

డైలాగ్‌లు లేని ఒక మూగ చీకటి.. ఆ చీకటిని చీల్చుకుంటూ వినిపించే ఉక్కు లాంటి బూట్ల చప్పుళ్లు! “ఢిల్లీ రోడ్ల మీద, కలకత్తా వీధుల్లో ఏ ఒక్కడు ‘వందేమాతరం’ అని నినాదం ఇచ్చినా.. వాడి చర్మాన్ని కొరడా దెబ్బలతో వలవండి!” అనే బ్రిటిష్ కలెక్టర్ గర్జనలు ఆ గాలిలో విషం కక్కుతున్నాయి. కలకత్తాలోని ఒక ఇరుకైన, అండర్‌గ్రౌండ్ గది. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటింది. మిణుకు మిణుకు మంటూ మూలన చిన్న నూనె దీపం, వెలుతురులో ఒక యువకుడు విలవిలలాడుతున్నాడు. కానీ అది భయంతో కాదు.. గుండెల్లో ఉప్పొంగుతున్న దేశభక్తి తన్నుకువచ్చి ఊపిరి ఆడని అగ్నిలా మారుతోంది. తన ఎడమ చేతి వేలిని కోసుకుని, ఆ ధారగా కారుతున్న రక్తంతో ఒక తెల్లని కాగితంపై అక్షరాలను అద్దుతున్నాడు. ఆ అక్షరాలే కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్వాతంత్ర్యపు చిచ్చును రగిలించిన మంత్రం.. ‘వందేమాతరం’.

అదొక నినాదం మాత్రమే కాదు, ఎంతోమంది దేశభక్తుల నెత్తురు మరిగించి, ఆంగ్లేయ సామ్రాజ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అమర గాథ! సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో, ఒక దేశం తన ఉనికిని చాటుకోవాలంటే దానికి ఒక ఆత్మ ఉండాలనేది కూడా అంతే నిజం. 1870ల మధ్యకాలంలో మహానుభావుడు “బంకించంద్ర ఛటోపాధ్యాయ” సృష్టించిన ఆ దివ్య పదాలు.. 1882లో ప్రచురితమైన ‘ఆనందమఠం’ నవల ద్వారా (సన్యాసి తిరుగుబాటు నేపథ్యంలో) అగ్నిలా ప్రవహించాయి. అది మొదటిసారిగా బహిరంగ వేదికపై గొంతెత్తి పలికిన క్షణం ఒక చరిత్ర. 1896లో కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశం. సభా ప్రాంగణమంతా నిశ్శబ్దం. విశ్వకవి “రవీంద్రనాథ్ టాగోర్” గారు మైక్ ముందుకు వచ్చి, ఆ మాతృభూమిని కీర్తిస్తూ గొంతు సవరించుకుని తొలిసారిగా ఆ గీతాన్ని ఆలపించారు.

“వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం
త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం, మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
వందేమాతరం”

ఆ క్షణంలో ఆ సభా ప్రాంగణంలోని ప్రతీ ఒక్కరి వెన్నులో విద్యుత్ ప్రవాహం కదిలింది. ఈ గీతం కేవలం అక్షరాల సముదాయం కాదు..మన మాతృభూమి యొక్క నాగరికత ఆత్మ అంటే సివిలైజేషనల్ ఎథోస్ కు ప్రతిరూపం.ఆ గీతం యొక్క అసలు అంతరార్థం ఏమిటో ఆ గొంతు ప్రసారం చేసింది. భారతమాతకు వందనం! తియ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ, విరబూసిన చెట్లతో శోభిల్లుతూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం అని..!

ఆ గొంతులోంచి ఉద్భవించిన మహా ప్రవాహం. తర్వాత ఒక ఉద్యమ రూపం దాల్చింది.1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన కుట్ర పన్నినప్పుడు, దేశం మొత్తం ఒక్కసారిగా లేచి నిలబడి ‘వందేమాతరం’ అంటూ స్వదేశీ ఉద్యమాన్ని ఉప్పెనలా తలపించింది.1907లో జర్మనీలోని స్టట్‌గార్ట్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ వేదికపై విప్లవ వనిత ‘మేడమ్ భికాజీ కామా’ ఎగరవేసిన భారత తొలి త్రివర్ణ పతాకం మధ్యలో ఇదే ‘వందేమాతరం’ అక్షరాలు దేదీప్యమానంగా వెలిగాయి. బ్రిటిష్ పాలకుల ఉరికొయ్యలను నవ్వుతూ ముద్దాడిన ఖుదీరామ్ బోస్, మదన్ లాల్ ధింగ్రా వంటి విప్లవ వీరులు తమ ప్రాణాలను వదిలేటప్పుడు చివరిగా పలికిన తుది నినాదం కూడా ఇదే! ఇన్ని పోరాటాల ఫలితంగానే జనవరి 24, 1950న రాజ్యాంగ పరిషత్ దీనికి జాతీయ గీతంగా సమానమైన సముచిత గౌరవాన్ని కట్టబెట్టింది. ఈ దేశం కేవలం భౌగోళిక సరిహద్దుల కలయిక కాదు. ఇది ఒక శాశ్వతమైన జీవన విధానం.

ఈ దేశాన్ని నిలబెట్టడంలో, ప్రతీ పౌరుడి నరనరాల్లో దేశభక్తిని రగిలించడం లో, దేశ సమగ్రతను కాపాడుకోవడం, సాంస్కృతిక విలువలను పెంపొందించడం వంటి పౌర బాధ్యతలు విషయంలో నిరంతర స్ఫూర్తితో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి జాతీయ వాద సంస్థలు నేటికీ ఆ భావన ను సజీవంగా ఉంచారు. జన గణ మన’ మన రాజ్యాంగబద్ధమైన జాతీయ గీతం, దానికి ఎల్లప్పుడూ తగిన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేస్తూనే, అదే సమయంలో, భారతదేశం యొక్క అసలైన నాగరికత, సాంస్కృతిక జీవన విధానం, మాతృభూమిపట్ల అంతులేని భక్తిభావం వంటి అత్యున్నత అంశాలకు ‘వందేమాతరం’ నిలువెత్తు రూపమని స్వయం సేవక్ లు
భయ్యాజీ జోషి, సునీల్ అంబేకర్ జీ తదితరులు ఎంతో గట్టిగా పునరుద్ఘాటించారు.ఈ విషయాన్ని సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా ఈ చారిత్రక సత్యాన్ని ప్రముఖంగా పునరుద్ఘాటించారు. వ్యవస్థాపకులు డాక్టర్ జీ నుంచి నేటి తరం వరకు ప్రతి ఒక్కరి ఆలోచన ఒక్కటే—”దేశం మొదట, వ్యక్తి తరువాత!” అనేదే…’

ఇంతటి పవిత్రమైన జాతీయ గీతానికి, అమరుల త్యాగాలకు నేడు పార్లమెంట్ సాక్షిగా అత్యున్నత రక్షణ కవచం లభించింది. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ ప్రభుత్వ దృఢ సంకల్పానికి ప్రతీకగా.. రాజ్యసభలో ఆమోదం పొందిన “జాతీయ గౌరవ అవమాన నిరోధక (సవరణ) బిల్లు-2026” అద్భుతమైన చట్ట రూపం దాల్చింది. మన జాతీయ చిహ్నాలను, గీతాలను అగౌరపరిచే ఎవరినైనా ఉపేక్షించని ఈ సరికొత్త చట్టం.. దేశ భవిష్యత్తును నిర్మించే ‘నేషన్ బిల్డింగ్’ ప్రక్రియలో మరో మహా అడుగు. ఈ విషయాన్ని దేశం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తులంతా మనసారా స్వాగతిస్తూ, గర్వంగా అభినందిస్తున్నారు!

ఇప్పుడు నేటి రియాల్టీలోకి వద్దాం. కాలేజీ కారిడార్లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, మరియు ఏఐ టెక్నాలజీతో దూసుకుపోతున్న జెన్ జీ, ఇంకా రేపటి భవిష్యత్తును అంచనా వేస్తున్న జెన్ ఆల్ఫా.. జెన్ బీటా… యువత అంతా.. ఒక్క క్షణం మీ ఫోన్లను పక్కన పెట్టి ఈ వాస్తవాన్ని ఆలోచించండి. ఈరోజు మీరు ఓపెన్‌గా, ఫ్రీగా, గర్వంగా కాలేజీ గేట్లు దాటుతున్నారన్నా, సోషల్ మీడియాలో మీ గొంతును స్వేచ్ఛగా వినిపిస్తున్నారన్నా.. దానికి కారణం నిశ్శబ్దంగా సేవ చేస్తూ దేశనిర్మాణంలో ఉన్న ఎవరో తెలియని, గుర్తింపు కోరుకోని త్యాగధనులు, అప్పట్లో
చిందించిన రక్తమే! వారు గురుదక్షిణగా చెల్లించిన వారి
జీవితకాలమే! కాలేజీలో లేదా ఎక్కడైనా ‘వందేమాతరం’ లేదా జాతీయ గీతం వినిపిస్తే, మీ చేతిలో ఉన్న ఫోన్‌ను పక్కన పెట్టి ఆ క్షణాన్ని గౌరవించండి. మీ మాతృభూమి గొప్పతనాన్ని, మన సాంస్కృతిక మూలాలను మీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సెలెబ్రేట్ చేసుకోండి. ఈ దేశం మనది. దీని సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన మహా బాధ్యత మనందరి భుజాల మీదే ఉంది. నేడు పార్లమెంటులో చట్టం వచ్చింది, కానీ ఆ చట్టానికి నిలువెత్తు ప్రాణం పోసేది మీ గుండెల్లోని దేశభక్తే! రండి, ఆ గర్వాన్ని గుండెల్లో నింపుకుంటూ, ఆ ఉత్సాహాన్ని నరనరాల్లో ప్రవహింపజేస్తూ గట్టిగా గొంతు కలుపుదాం..! వందేమాతరం! జై హింద్! భారత్ మాతా కీ జై!

9951715215