హైదరాబాద్, మహా.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి పోలీస్ నియామక మండలి బుధవారం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం సివిల్ కానిస్టేబుల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052 పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44 ఎస్సైలు, 1,380 కానిస్టేబుల్ పోస్టులు, అగ్నిమాపక శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్ పోస్టులు, జైళ్ల శాఖలో 223 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు నియామక మండలి తెలిపింది. దరఖాస్తు చేసుకునే ముందు వైద్య, శారీరక అర్హతలను అభ్యర్థులు పరిశీలించుకోవాలని సూచించింది.







