కాళేశ్వరం నిర్లక్ష్య నిర్మాణానికి నిదర్శనం.
* బీఆర్ఎస్ తీరుపై ఉత్తమ్ తీవ్ర విమర్శలు.
* కాళేశ్వరం నీరు వాడకుండానే తెలంగాణలో రికార్డు ధాన్యం ఉత్పత్తి..
హైదరాబాద్, మహా.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీటిని కూడా వినియోగించకుండానే తెలంగాణ దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన వారం రోజుల్లోనే లీకేజీలు ప్రారంభమయ్యాయని, ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి సహా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించినా పట్టించుకోలేదన్నారు.
మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం వడ్డీ రూపంలోనే సుమారు రూ.16 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఉత్తమ్ వెల్లడించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఈ అంశంపై వాస్తవాలను దాచిపెట్టి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అయితే తమ ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చూస్తోందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం విచారకరమని మంత్రి అన్నారు. ఇసుక నేలపై కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేశారని, దీనిపై ఐఐటీ బాంబేతో పాటు అంతర్జాతీయ నిపుణుల సహకారంతో సాయిల్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. బ్యారేజీల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించే ముందు ప్రజల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత, కక్కుర్తి కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి చేరుకుందని విమర్శించిన ఆయన, ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మరోసారి స్పష్టం చేశారు.
కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ బూటకపు ప్రచారం చేస్తోందని ఆరోపించిన ఉత్తమ్, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ వరకు సుమారు 18 కిలోమీటర్ల దూరం ఉందని, అన్నారం బ్యారేజీలో రంధ్రాలు ఉన్నాయని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేశారు. 2023 నవంబర్‌లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ప్రాథమిక నివేదిక సమర్పించిందని, అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. భారీ కమీషన్ల కోసమే ఫౌండేషన్ నాణ్యతను పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు.
కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుంచి బీఆర్ఎస్‌కు రూ.1,400 కోట్లు చెక్కుల రూపంలో అందాయని కల్వకుంట కవిత చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని ఉత్తమ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేఘా సంస్థకు ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా కేటాయించలేదని స్పష్టం చేశారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ పంపామని, దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా 24 గంటల్లో సీబీఐ విచారణ జరిపిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ధాన్యం కుంభకోణానికి పాల్పడిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుని అరెస్టులు చేస్తామని హెచ్చరించిన మంత్రి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తిచేసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.







