ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా.
* ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలి.
* సీఈవో సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, మహా.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కేవలం తప్పులు లేని, పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడానికేనని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో ఎస్‌ఐఆర్ పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను ఆగస్టు 3వ తేదీలోగా వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 76 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ 90 శాతం పూర్తయిందని, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే వంద శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా నిర్ణీత గడువులోపు ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి వంటి పట్టణ జిల్లాల్లో డిజిటలైజేషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియను వేగవంతం చేసి ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
డిజిటలైజేషన్ పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు), సూపర్‌వైజర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఈవో హెచ్చరించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లన్నీ సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రాజకీయ పార్టీలతో నిర్వహించే సమావేశాలను తప్పనిసరిగా వీడియో రికార్డు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వీఐపీ, వీవీఐపీ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కూడా చేపట్టాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని సుదర్శన్ రెడ్డి మరోసారి స్పష్టం చేస్తూ, ప్రజలు అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.







