ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్.
• ఉప్పర్‌పల్లి కోర్టు ఆగస్టు 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్.
హైదరాబాద్, మహా.
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడినట్లు నమోదైన కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం అరెస్టు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
విచారణ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వాదిస్తూ, తమ క్లయింట్‌కు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 35(3) నిబంధనలను పోలీసులు ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర విచారణ జరపకుండానే ఆయనను సస్పెండ్ చేయడం చట్టబద్ధం కాదని, సరైన ఆధారాలు లేకుండానే అరెస్టు చేసి సస్పెండ్ చేశారని వాదించారు. జాతీయ పోలీస్ అకాడమీలో బాధితురాలు చేసిన ఫిర్యాదులో లైంగిక వేధింపుల అంశం లేదని, తప్పుడు ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. బాధితురాలిపై తీవ్ర ఒత్తిడి ఉందని, ఇరువురు ట్రైనీ ఐపీఎస్ అధికారులకు ముందే పరిచయం ఉందని పేర్కొంటూ రిమాండ్‌ను తిరస్కరించాలని కోర్టును కోరారు.
దీనికి ప్రతిగా పోలీసుల తరఫు న్యాయవాది వాదిస్తూ, బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చిందని, తనపై శారీరక దాడి కూడా జరిగిందని ఆమె వెల్లడించినట్లు కోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ఇదిలా ఉండగా, కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఉదయం సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఇందుకోసం ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి అశోక్‌నగర్‌లోని స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్–25 సమీపంలో గతంలో ఆయన అద్దెకు నివసించిన ఇంటికి తీసుకెళ్లి పరిశీలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
మరోవైపు తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరిగింది. బాధితురాలికి నోటీసులు జారీ చేయాల్సి ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది పల్లె నాగేశ్వర్‌రావు కోర్టుకు తెలిపారు. దీంతో బాధితురాలికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ నెల 18న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులు, దాడి తదితర ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఫిర్యాదు నమోదైన రోజే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు, చెంపపై కమిలిన గాయాలు, ఎడమ కాలి చర్మంపై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
కేసు నమోదు అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అనంతరం హైదరాబాద్ శివారులో ఆయనను అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా చార్మినార్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జ్యోత్స్నను, పర్యవేక్షణ అధికారిగా మహిళా భద్రత విభాగం డీసీపీ లావణ్యను నియమించి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.







