జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ భారత్‌లో అంతర్భాగాలే.
* తప్పుడు ప్రచారాలకు కేంద్రం గట్టి కౌంటర్.
* పీవోకే ఎన్నికలు కంటితుడుపు చర్యలే.
* అక్రమ ఆక్రమణను కప్పిపుచ్చే ప్రయత్నమని విదేశాంగ శాఖ వ్యాఖ్య.
ఢిల్లీ, మహా.
జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాప్తి అవుతున్న తప్పుడు ప్రచారాలకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఈఏ) మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రస్తుతం పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలతో సహా మొత్తం భూభాగం భారతదేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం తన అధికారిక సామాజిక మాధ్యమాల వేదికలపై స్పందించిన ఎంఈఏ, ప్రముఖ అమెరికన్ టీవీ షోలోని ఓ వైరల్ మీమ్‌ను ఉపయోగిస్తూ “నేను మీకు ఇది ఎన్ని సార్లు వివరించాలి?” అనే వ్యాఖ్యతో తప్పుడు ప్రచారాలను ఖండించింది.
పదేపదే జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్న వారికి ఇదే తమ సమాధానమని విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు కూడా భారతదేశానికి విడదీయరాని భాగాలని స్పష్టం చేస్తూ, పాకిస్థాన్ నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియ కాదని, అక్రమ ఆక్రమణను సమర్థించుకునేందుకు చేస్తున్న కంటితుడుపు చర్యలేనని విమర్శించింది.
పీవోకేలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ అక్కడి ప్రజల నిజమైన ప్రజాస్వామ్య ఆకాంక్షలను ప్రతిబింబించదని ఎంఈఏ పేర్కొంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనా అణచివేతను ప్రపంచం నుంచి దాచిపెట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విధానాల ఫలితంగానే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారీ ప్రజా నిరసనలు జరుగుతున్నాయని వెల్లడించింది.
ఓ నెటిజన్ జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ భారతదేశంలో భాగం కాదని, 2019లో ఆర్టికల్ 370 రద్దుతో భారత్ అక్రమంగా విలీనం చేసుకుందని, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం అది వివాదాస్పద భూభాగమని చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ విదేశాంగ శాఖ ఈ వివరణ ఇచ్చింది. ఆ వాదనలను పూర్తిగా తిరస్కరించిన ఎంఈఏ, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ భారత సార్వభౌమాధికారంలో విడదీయరాని భాగాలని మరోసారి స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో (పీవోకే) మానవ హక్కుల పరిరక్షణ, అరెస్టయిన నిరసనకారుల విడుదల, నమోదైన కేసుల ఉపసంహరణ తదితర డిమాండ్లతో ప్రజలు గత 52 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలు ఇటీవల మరింత ఉధృతమయ్యాయి. అధికారులతో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో వేలాది మంది ముజఫరాబాద్ వైపు మార్చ్‌కు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో రావల్కోట్లో నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించగా, అనేక మంది గాయపడినట్లు సమాచారం. జూన్ 5 నుంచి జులై 28 వరకు జరిగిన ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 67కు చేరిందని జేఏఏసీ వెల్లడించింది. మృతులను అమరవీరులుగా పేర్కొంటూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించింది.
మరోవైపు, పాకిస్థాన్ నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రజల స్వేచ్ఛా సంకల్పాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్నాయని పీవోకే నాయకులు ఆరోపిస్తున్నారు. అరెస్టులు, బెదిరింపులు, భారీ భద్రతా బలగాల మోహరింపుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రావల్కోట్లో జరిగిన కాల్పుల ఘటనపై తక్షణమే స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపించాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా పాకిస్థాన్ అధికారులను కోరింది.






