Mahaa Daily Exclusive

  విద్యార్థులపై వేధింపులు ఆపాలి…

Share

విద్యార్థులపై వేధింపులు ఆపాలి.
* లేదంటే దేశవ్యాప్త ఉద్యమం: అభిజీత్ దీప్కే.
ఢిల్లీ, మహా.
నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నిరసన తెలిపిన విద్యార్థులపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వెంటనే నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే త్వరలోనే దేశవ్యాప్తంగా మరోసారి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, తమ భవిష్యత్తు, హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై లాఠీచార్జి, పెలెట్ గన్స్ వంటి చర్యలు తీసుకోవడం తీవ్రంగా ఖండించారు.
జులై 20న జరిగిన నిరసనల్లో విద్యార్థులపై అధిక బలప్రయోగం జరిగిందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. విద్యార్థులను ఉగ్రవాదుల మాదిరిగా పెలెట్ గన్స్‌తో లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తమ హక్కులు, భవిష్యత్తు కోసం పోరాడుతున్న విద్యార్థులపై ఇలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టకూడదని అన్నారు. వేధింపులు ఇదే విధంగా కొనసాగితే మరోసారి ప్రజల్లోకి వెళ్లి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే కొత్త దశలో ఆందోళనలు ప్రారంభమవుతాయని తెలిపారు.
జెన్-జెడ్ యువతపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అభిజీత్ దీప్కే, ఆమె వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని కొట్టిపారేశారు.
ఇదిలా ఉండగా, ఇటీవల జంతర్‌మంతర్ వద్ద జరిగిన సీజేపీ నిరసనలు, ‘ఛలో సంసద్’ కార్యక్రమం సందర్భంగా రాళ్లతో నిండిన ట్రక్కు కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఆ ట్రక్కుకు నిరసన కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వివాదాస్పదంగా మారిన ట్రక్కును జులై 16న జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో స్వాధీనం చేసుకున్నారు. ఈఈసీఓ వ్యాన్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు గాయపడటంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు భాగంగా ట్రక్కును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో తగిన స్థలం లేకపోవడంతో తాత్కాలికంగా బయట నిలిపినట్లు తెలిపారు.
‘ఛలో సంసద్’ కార్యక్రమం సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా జులై 20 తెల్లవారుజామున ట్రక్కును అక్కడి నుంచి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. తరలించే ముందు లారీలో ఉన్న రాళ్లను పూర్తిగా ఖాళీ చేసి, అనంతరం వాహనాన్ని మరో సురక్షిత ప్రాంతానికి తరలించామని వివరించారు. ఇది పూర్తిగా చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలో భాగమేనని, దీనికి నిరసనలు లేదా ఏదైనా కుట్రతో సంబంధం ఉందని ప్రచారం చేయడం నిరాధారమని స్పష్టం చేశారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికల్లో ధ్రువీకరించని సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలకు ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అధికారికంగా ధ్రువీకరించిన సమాచారాన్నే నమ్మాలని సూచిస్తూ, తప్పుడు ప్రచారాల ద్వారా ప్రజల్లో అనవసర ఆందోళన సృష్టించే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.