- ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న
ప్రజా ప్రభుత్వం - 100 రోజుల్లో రూ. 6,000 కోట్ల బకాయిల చెల్లింపులు
- సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఈరోజు మరో రూ. 2 వేల కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా
- ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చాటుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో రూ. 6,000 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్న మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతూ తమ చిత్తశుద్ధిని మరోసారి చాటుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల స్పష్టమైన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం మరో రూ. 2 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రూ. 6 వేల కోట్ల బకాయిలను చెల్లించింది.
మూడు విడతల్లో రూ. 6,000 కోట్లు
గత మే 29న
మొదటి విడత గా రూ. 2,000 కోట్లు, జూన్ 30న
రెండో విడతగా రూ. 2,000 కోట్లు, మూడో విడత మరో రూ. 2,000 కోట్లు (గురువారం) విడుదల చేశారు.
పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం ఈ నిధులతో పూర్తిగా చెల్లించింది. రాబోయే రోజుల్లో మిగిలిన ఇతర బకాయిలను కూడా ఇదే రీతిలో క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల నిధులు విడుదల చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న సానుకూల ధోరణి అభినందనీయమని ఉద్యోగ జేఏసీ నేతలు కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






